పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో శనివారం విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తన గెలుపుపై ధీమాగా కనిపిస్తున్నారు. ప్రధానికి వ్యతిరేకంగా ఓటు వేసిన తిరుగుబాటుదారులను అనర్హులుగా ప్రకటిస్తామని అధికార తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ తన విజయంపై నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రధాని విశ్వాస పరీక్షపై శనివారం సమావేశం జరగనుందని జాతీయ అసెంబ్లీ సచివాలయం తెలిపింది. ఆ దేశ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి ప్రవేశ పెట్టనున్న విశ్వాస తీర్మానంపై సభ్యులు ఓటు వేయనున్నారు. అయితే.. ఈ ఓటింగ్‌ను తాము బహిష్కరిస్తున్నట్లు ప్రతిపక్ష పాకిస్థాన్ డెమెక్రటిక్ మూవ్మెంట్(పీడీఎం) శుక్రవారం తెలిపింది. దాంతో ప్రతిపక్ష పార్టీ లేకుండానే విశ్వాస పరీక్ష జరగనుంది.
సెనేట్ స్థానం ఎన్నికలో సొంత పార్టీకే చెందిన ఆర్థిక మంత్రి అబ్దుల్ హఫీజ్ షేక్ ఓటమి తర్వాత ప్రధాని పదవికి రాజీనామా చేయాలనే విపక్షాల డిమాండ్ నేపథ్యంలో విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు ఇమ్రాన్. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో 342 స్థానాలుండగా, ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీకి 157 మంది సభ్యులు ఉన్నారు.
ఇదీ చదవండి:చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి సిద్ధం: ఇమ్రాన్