కొవిడ్ సంక్షోభంలో భారత్‌ను ఆదుకునే పేరుతో అమెరికాలో ఉన్న పాకిస్థాన్‌కు చెందిన కొన్ని స్వచ్ఛంద సంస్థలు విరాళాలు సేకరిస్తున్నాయి. హెల్పింగ్ ఇండియా బ్రీత్ పేరుతో కొన్ని లక్షల డాలర్ల విరాళాలు సేకరించిన ఈ సంస్థలు.. ఆ నిధులను ఉగ్రవాదులకు, పాకిస్థాన్ సైన్యానికి, మత ఛాందసవాదులకు, పాలస్థీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌కు చేరవేస్తున్నాయని డిస్‌ఇన్‌ఫో ల్యాబ్ నివేదిక వెల్లడించింది. దీనిని కొవిడ్ స్కామ్ 2021గా పిలుస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది.
పెద్ద ఎత్తున సేకరించి..
భారత్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చిన వేలాదిమంది డబ్బును హెల్పింగ్ ఇండియా బ్రీత్ పేరుతో కొల్లగొట్టారని డిస్‌ఇన్‌ఫో ల్యాబ్ డాక్యుమెంట్ తెలిపింది. ఈ సొమ్ము ఎక్కడికి చేరాలో అక్కడికి చేరకపోగా సామాజిక అలజడులు సృష్టించేవారికి, ఉగ్రవాదులకు చేరుతున్నాయని ప్రకటించింది. పాకిస్థాన్ నుంచి అమెరికాలో నడిచే స్వచ్ఛంద సంస్థలు ఏప్రిల్ 27, 28 తేదీల్లో అమెరికాలో అనేక విరాళ సేకరణ సంస్థలను ఏర్పాటు చేశాయి. వీటిలో ఇమానా ఇస్లామిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అనే సంస్థ పెద్దఎత్తున విరాళాలు సేకరించింది. ఈ సంస్థ ఇస్మాయిల్ మెహర్ అనే వైద్యుడి ఆధ్వర్యంలో భారీ నిధులు సమీకరించినట్లు వెల్లడించింది. ఇన్‌స్టా గ్రామ్‌లో ఈ సంస్థ చాలా వేగంగా విరాళాలు సేకరించింది. కానీ విరాళాలు సేకరించడంలో చూపిన శ్రద్ధ వాటిని ఎలా వినియోగించారనే విషయంలో మాత్రం చూపలేకపోయింది. కొవిడ్ విరాళాల ఖర్చుపై పారదర్శకత పాటించ లేదు. ఎవరైనా విరాళాల ఖర్చు గురించి ప్రశ్నిస్తే.. వారి నోళ్లు మూయిస్తోందని డిస్‌ఇన్‌ఫో ల్యాబ్ నివేదిక పత్రులు తెలిపాయి.
కోటి 80 లక్షలు లక్ష్యంగా..
హెల్ప్ ఇండియా బ్రీత్ క్యాంపెయిన్ పేరుతో ఇన్‌స్టాలో ఏప్రిల్ 27న ఈ సంస్థ విరాళాల సేకరణ హడావుడిగా మొదలెట్టింది. తొలుత కోటి 80 లక్షల రూపాయల సేకరణను లక్ష్యంగా పెట్టుకుంది. విరాళాలు సేకరించేందుకు భారత్ రూపొందించిన ఇండియా మ్యాప్‌ను ఉపయోగించగా, తన వెబ్‌సైట్‌లో మాత్రం కశ్మీర్‌ను కలిపేసుకున్న పాక్ మ్యాప్‌ను ఉంచింది.
విరాళాల సేకరణకు ఇమానా ఇచ్చిన పిలుపుతో భారతీయులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పెద్దఎత్తున స్పందన వచ్చింది. తొలుత నిర్దేశించుకున్న కోటీ 80 లక్షల రూపాయల లక్ష్యాన్ని 5 కోట్ల రూపాయలకు పెంచింది. అయితే ఇన్‌స్టాలో గంటకు లక్ష డాలర్లకు పైగా విరాళాలు వచ్చినట్లు డిస్‌ఇన్‌ఫో ల్యాబ్ పేర్కొంది. మొత్తంగా ఇమానా ఒక్క ఇన్‌స్టాలోనే 8.7 కోట్ల రూపాయల విరాళాలు సేకరించిందని వెల్లడించింది. అయితే అన్ని మార్గాల్లో 150 కోట్ల రూపాయల విరాళాలు సేకరించినట్లు ఇమాన్ సంస్థ తెలిపింది. వీటిలో 30 కోట్ల రూపాయలు భారత్‌లో పంపిణీ చేసేందుకు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, మాస్కులు, ఇతర వైద్య సామాగ్రి కొనేందుకు వినియోగించినట్లు తెలిపింది. అయితే ఇమాన్ సంస్థ నుంచి తమకు ఎలాంటి సాయం అందలేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. భారత్‌కు సాయం చేసినట్లు ఇమాన్ చేస్తున్న ప్రచారం అసత్యమని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:ఆక్రమిత కశ్మీర్లో పాక్ కుట్ర!