భారత్ నుంచి పత్తి, చక్కెర దిగుమతి చేసుకోవాలన్న నిర్ణయంపై పాకిస్థాన్ యూ-టర్న్ తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక సమన్వయ కమిటీ(ఈసీసీ) ప్రతిపాదనను పాకిస్థాన్ మంత్రివర్గం గురువారం తిరస్కరించింది. ఎట్టిపరిస్థితుల్లో భారత్‌తో వాణిజ్యం కొనసాగించేది లేదని సమావేశానికి నేతృత్వం వహించిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేసినట్లు మానవ హక్కుల మంత్రి శిరీన్ మజారీ తెలిపారు.
"కశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించేంత వరకు భారత్‌తో సాధారణ సంబంధాలు కొనసాగించలేమని ప్రధాని ఇమ్రాన్ చెప్పారు."
-శిరీన్ మజారీ, పాక్ మానవ హక్కుల మంత్రి
రెండున్నర ఏళ్లుగా భారత్ నుంచి పత్తి, చక్కెర దిగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు ఈసీసీ సమావేశం అనంతరం బుధవారం పాక్ ఆర్థిక మంత్రి హమ్మద్ అజహర్ ప్రకటించారు. దీంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పాక్షిక పునరుద్ధరణపై ఆశలు రేకెత్తాయి. కానీ మంత్రివర్గ నిర్ణయంతో దానిపై నీళ్లు చల్లినట్లైంది.
2019 ఆగస్టు 5న జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి రద్దు చేసినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిలిచిపోయింది.
ఇదీ చూడండి: యుద్ధం వచ్చినా భారత్- పాక్ మధ్య వీడని 'ఫోన్ బంధం'!