మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తమ దేశంలోనే ఉన్నాడని పాక్ ఎట్టకేలకు ఒప్పుకుంది. దావూద్ తమ దేశంలో లేడని ఇన్నాళ్లూ బుకాయిస్తూ వస్తున్న దాయాది దేశం దేశం ఈ విషయాన్ని అంగీకరించక తప్పలేదు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) విధించిన గ్రే లిస్ట్ నుంచి తప్పించుకునేందుకు తాజాగా 88 నిషేధిత ఉగ్రసంస్థలు, అధినేతలపై కఠిన ఆంక్షలు విధించింది. ఇందులో దావూద్ పేరు ఉండడం వల్ల ఇన్నాళ్లుగా దాచిన నిజం బయటకొచ్చింది.
ఆర్థిక ఆంక్షలతో..
పారిస్‌లోని ఎఫ్‌ఏటీఎఫ్.. పాక్‌ను 2018లో గ్రే లిస్ట్‌లో పెట్టింది. 2019 చివరి నాటికి ఉగ్రవాద సంస్థలు, వాటి నేతలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కరోనా నేపథ్యంలో గడువును పొడిగించింది. ఈ క్రమంలో గ్రే లిస్ట్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు తాజాగా ఆ దేశంలో ఈ నెల 18న రెండు నోటిఫికేషన్లు జారీ చేసింది. అందులో నిషేధిత ఉగ్రవాద సంస్థలు సహా, వాటి నేతల ఆర్థిక కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది. వారి స్థిర, చరాస్తులను సీజ్ చేసి బ్యాంకు ఖాతాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. ఇందులో దావూద్ ఇబ్రహీంతో పాటు జమాత్ ఉద్ దవా(జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్, జైషే మహ్మద్(జేఈఎం) చీఫ్ మూసూద్ అజహర్, జకీర్ రెహమాన్ లఖ్వీ పేర్లు ఉన్నాయి.
ముప్పు తప్పించుకునేందుకే..
ఈ నోటిఫికేషన్ల ప్రకారం దావూద్ కరాచీలో తలదాచుకుంటున్నట్లు తేలింది. నోటిఫికేషన్‌లోని అడ్రస్‌ను బట్టి ఈ విషయం స్పష్టమైంది. దావూద్ కరాచీలోనే ఉంటున్నాడని భారత్ మొదటి నుంచీ చెబుతూ వస్తోంది. ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్ నుంచి బయటపడేందుకే పాకిస్థాన్ తాజా నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలుస్తోంది. గ్రే లిస్ట్‌లో ఉంటే ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సహా ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక సాయం పొందడం పాక్‌కు కష్టతరమవుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ముప్పు నుంచి తప్పించుకునేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: 'దావూద్‌కు ఆ రోజే స్కెచ్ వేశారు... కాస్తలో మిస్'