స్వాతంత్య్ర దినోత్సవం రోజే పాకిస్థాన్‌లో అమానవీయ సంఘటన జరిగింది. ఓ వీడియో షూట్ చేస్తుండగా.. వందల మంది గుర్తుతెలియని వ్యక్తులు తనపై దాడికి దిగారని మహిళా టిక్‌టాకర్ ఆరోపించారు. తనను వివస్త్రను చేసి.. దుస్తులను గాల్లోకి ఎగురేస్తూ తీసుకెళ్లారన్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లారీ అడ్డా స్టేషన్ పోలీసులు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
వీడియో షూట్ చేస్తుండగా..
ఆగస్టు 14న.. లాహోర్‌లోని మినార్-ఈ -పాకిస్థాన్ వద్ద మహిళా టిక్‌టాకర్ తన గ్రూప్ సభ్యులతో కలిసి వీడియో షూట్ చేశారు. అదే సమయంలో 300-400 మంది గుర్తుతెలియని వ్యక్తులు అక్కడకు వచ్చి.. సదరు మహిళపై దాడి చేశారు. మహిళను వివస్త్రను చేసి.. గాల్లోకి ఎగరేశారు. తనతోపాటు.. గ్రూప్ సభ్యులనూ వేధించారని మహిళ.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన చెవిపోగులు, ఫోన్, రూ. 15వేలు నగదును లాగేసుకున్నారని తెలిపింది.
ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఘటనపై పాక్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లాహోర్ డీఐజీ సాజిద్ ఖియానీ స్పందించారు. తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. నిందితులను చట్టపరంగా శిక్షిస్తామన్నారు.
ఇదీ చదవండి: రాజకీయాల్లోకి మహిళలా? పగలబడి నవ్విన తాలిబన్లు!