కశ్మీర్ సమస్య పరిష్కారానికి భారత్ చర్చలకు వచ్చేలా అమెరికా కృషి చేయాలని పాకిస్థాన్ అభ్యర్థించింది. కశ్మీర్లో శాంతి నెలకొనాలంటే భారత్‌తో ద్వైపాక్షిక చర్చలు జరగాలని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి అమెరికా ఎదుట సాగిలపడ్డారు.
"ఈ సమస్య ఇరు దేశాలకు సంబంధించింది అని భారత్ నొక్కి చెబుతోంది. అయితే ద్వైపాక్షిక చర్చలకు మాత్రం సిద్ధంగా లేదు. కశ్మీర్‌పై చర్చలకు భారత్ తేలికగా అంగీకరించదు. మీ ప్రాబల్యం ఉపయోగించి భారత్ చర్చలను కొనసాగించేలా చేయాలని మిమ్మల్ని(అమెరికాను) కోరుతున్నాం."
-షా మహ్మద్ ఖురేషి, పాక్ విదేశాంగ మంత్రి
ఇరు దేశాలు అంగీకరిస్తే కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం చేసేందుకు తాను సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యల తర్వాత అమెరికాను ఖురేషి ప్రాధేయపడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదే విషయమై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరస్‌కు కూడా లేఖ రాయనున్నట్లు ఖురేషి తెలిపారు.
దృఢ వైఖరితో భారత్
కశ్మీర్ విషయంలో దృఢమైన విధానంతో ఉన్నట్లు భారత్ ఇప్పటికే ప్రకటించింది. సరిహద్దు ఉగ్రవాదంపై పాక్ చర్యలు తీసుకున్నాకే చర్చలు జరుపుతామని స్పష్టం చేసింది. కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వంపై ట్రంప్ వ్యాఖ్యలను కూడా భారత్ ఖండించింది.
ఇదీ చూడండి: కశ్మీర్ అంశంపై పాక్‌తో ప్రత్యక్షంగానే: జయ్శంకర్