పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు అక్కడి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన రాజద్రోహం కేసులో ఇస్లామాబాద్ ప్రత్యేక కోర్టు ఇచ్చిన మరణశిక్ష తీర్పును సవాలు చేస్తూ పాక్ సుప్రీం కోర్టులో ఆయన దాఖలు చేసిన అప్పీలును తిరస్కరించింది న్యాయస్థానం. కోర్టు ఎదుట హాజరైతేనే అప్పీలు విచారణను స్వీకరిస్తామని స్పష్టం చేసింది.
ఈ మేరకు కోర్టు రిజిస్ట్రార్ సమాధానమిచ్చినట్లు డాన్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. పిటిషన్ తిరస్కరణపై కోర్టు రిజిస్ట్రార్ నిర్ణయాన్ని ముషారఫ్ తరఫు న్యాయవాదుల కౌన్సిల్ అప్పీలు చేయనున్నట్లు తెలుస్తోంది.
దేశద్రోహం కేసులో తనకు మరణశిక్ష విధించిన ఇస్లామాబాద్ ప్రత్యేక కోర్టు నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ గురువారం సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు ముషారఫ్. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ విచారణ చేశారని పేర్కొంటూ అప్పీలు పిటిషన్‌ను ముషారఫ్ తరఫున న్యాయవాది సల్మాన్ సఫ్దర్ దాఖలు చేశారు.
పాక్ చరిత్రలో ఓ మాజీ సైన్యాధ్యక్షుడిపై రాజద్రోహం కేసు నమోదుకావడం, మరణశిక్ష విధించడం ఇదే తొలిసారని డాన్ పత్రిక పేర్కొంది.
ఇదీ చూడండి: పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ మరణ శిక్ష కొట్టివేత