కరోనా కారణంగా పాకిస్థాన్లో 6 నెలలుగా మూసివేసిన విద్యాసంస్థలు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. బుధవారం నుంచి అన్ని విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా కఠిన ఆంక్షలతో కూడిన అనుమతులిచ్చినట్లు అధికారులు తెలిపారు. .
ప్రాథమిక పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు వారి పేర్లను నమోదు చేసుకున్నారని ఆ దేశ విద్యాశాఖ మంత్రి షఫ్కత్ మహమూద్ తెలిపారు. ఎక్కువ కాలం బడులను తెరవకపోవటం వల్ల విద్యార్థులు నష్టపోయారని అన్నారు. మహమ్మారి వ్యాప్తిని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే విద్యా సంస్థల పునఃప్రారంభానికి అనుమతినిచ్చినట్లు పేర్కొన్నారు.
మొదటి దశలో భాగంగా సెప్టెంబర్ 15న విద్యా సంస్థలను ప్రారంభించింది పాక్ ప్రభుత్వం. పాఠశాలకు చెందిన మొత్తం 171,436 మందికి తాజాగా కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో కేవలం 1 శాతం మంది వైరస్ బారినపడినట్లు గుర్తించామని విద్యా శాఖ మంత్రి వెల్లడించారు. ఈ గణాంకాల ఆధారంగానే తిరిగి ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఇప్పటి వరకు పాకిస్థాన్ వ్యాప్తంగా 3 లక్షల మందికి పైగా కరోనా బారిన పడగా..6,479 మంది మృతి చెందారు.