పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా.. భారత్‌కు బహిరంగ హెచ్చరికలు చేశారు. భారత్ దుశ్చర్యలకు పాల్పడితే.. వాటిని అడ్డుకుని విజయం సాధించే సామర్థ్యం తమకుందని వెల్లడించారు. పాకిస్థాన్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశ కీర్తిని, సాయుధ దళాల శక్తి సామర్థ్యాలను తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. వాటిని ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు బజ్వా.
"హైబ్రిడ్ యుద్ధం పేరుతో మన మీద దాడి చేస్తున్నారు. దేశానికి అపకీర్తిని తెచ్చేందుకు, సాయుధ దళాల శక్తి సామర్థ్యాలను తగ్గించి, అలజడులు సృష్టించడమే దాని ముఖ్య లక్ష్యం. సవాళ్ల గురించి మాకు పూర్తిగా తెలుసు. జాతీ మొత్తం ఏకమై ఈ యుద్ధంలో విజయం సాధిస్తుంది."
--- జావేద్ బజ్వా, పాక్ ఆర్మీ చీఫ్.
పాకిస్థాన్ శాంతిని కోరుకునే దేశమని.. అయితే ఒకవేళ యుద్ధమే వస్తే.. దీటుగా జవాబు చెప్పే సత్తా తమకుందని స్పష్టం చేశారు బజ్వా. భారత్ పేరు ఎక్కడా ప్రస్తావించకుండా ఈ వ్యాఖ్యలు చేశారు.
'బాలాకోట్‌ను గుర్తుతెచ్చుకోండి'
అదే సమయంలో భారత్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పాక్ ఆర్మీ చీఫ్. 1965లో జరిగిన యుద్ధంలో భారత్‌ను ఓడించామన్నారు. 2019 బాలాకోట్ వాయు దాడుల్లో భారత్‌కు బుద్ధిచెప్పామన్నారు. ఫలితంగా తమ శక్తిపై ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దని వెల్లడించారు.
కశ్మీర్ అంశాన్ని కూడా ప్రస్తావించిన బజ్వా.. ఆర్టికల్ 370ని రద్దు చేసిన భారత్ ఆ ప్రాంతంలో శాంతికి ప్రమాదం తెచ్చిపెట్టిందని మండిపడ్డారు.
ఇదీ చూడండి:- పాక్ ఆర్మీ చీఫ్‌కు సౌదీలో ఘోర పరాభవం