గిల్గిత్- బాల్టిస్థాన్ అసెంబ్లీకి నవంబర్ 15న ఎన్నికలు నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. ఇదివరకు వాయిదా పడ్డ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువరిస్తూ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి- గిల్గిట్-బాల్టిస్థాన్‌కు రాష్ట్ర హోదా ఇచ్చే పనిలో పాక్
జూన్ 24న గిల్గిత్- బాల్టిస్థాన్ అసెంబ్లీ గడువు ముగిసింది. ఆగస్టు 24నే ఎన్నికలు జరగాల్సి ఉండగా.. వాయిదా పడ్డాయి. గిల్గిత్-బాల్టిస్థాన్‌ను పూర్తి స్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఇమ్రాన్ సర్కార్ ప్రయత్నిస్తోందన్న కథనాల మధ్య తాజా ప్రకటన వెలువడింది. సెప్టెంబర్ 16న విపక్ష నేతలతో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కామర్ జావెద్ బజ్వా జరిపిన చర్చల్లో ఈ విషయాన్నే చర్చించినట్లు తెలుస్తోంది.
మీకెలాంటి హక్కు లేదు
అయితే జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌తో పాటు గిల్గిత్ బాల్టిస్థాన్ ప్రాంతాలు తమకే చెందుతాయని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇవన్నీ భారత్‌లో అంతర్భాగమని పాకిస్థాన్‌కు పలుమార్లు వెల్లడించింది. చట్టవిరుద్ధంగా, బలవంతంగా ఆక్రమించుకున్న ప్రాంతాలపై పాకిస్థాన్‌కు ఎలాంటి హక్కు లేదని తేల్చిచెప్పింది.
ఇదీ చదవండి- ఆ ఎన్నికల నిర్వహణపై పాక్‌ను తప్పుబట్టిన భారత్
అంతకుముందు పాకిస్థాన్ విడుదల చేసిన రాజకీయ చిత్రపటంపైనా భారత్ వ్యతిరేకత వ్యక్తం చేసింది. గుజరాత్, జమ్ముకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలకు చెందిన భూభాగాలను పాకిస్థాన్ తనదిగా చూపించడాన్ని తప్పుబట్టింది.
మరోవైపు, లద్దాఖ్ ఎంపీ జమ్యాంగ్ సెరింగ్ నంగ్యాల్.. పాక్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 'పాకిస్థాన్ ఆక్రమిత గిల్గిత్-బాల్టిస్థాన్'లో క్రూరమైన మారణహోమం ప్రారంభించేందుకు ఇమ్రాన్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్నారు. గిల్గిత్- బాల్టిస్థాన్ పూర్తిగా భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేశారు. అక్కడి ప్రజలు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.
మంత్రి వ్యాఖ్యలతో
గిల్గిత్-బాల్టిస్థాన్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సెప్టెంబర్ 17న పాకిస్థాన్ మంత్రి అమిన్ గండాపుర్ పేర్కొన్నట్లు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పత్రికలో కథనాలు వచ్చాయి. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ త్వరలోనే గిల్గిత్‌ను సందర్శించనున్నట్లు అమిన్ చెప్పినట్లు పత్రిక పేర్కొంది.
ఇదీ చదవండి- గిల్గిత్-బాల్టిస్థాన్‌లో ఎన్నికలపై భారత్-పాక్ ఢీ