జపాన్ వైపు భయంకరమైన హగీబిస్ తుపాను దూసుకొస్తోంది. తుపాను తీరాన్ని దాటకముందే భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే తూర్పు టోక్యోలోని చైబాలో ఒక వ్యక్తి మృత్యువాత పడ్డాడు.
చైబాలో టొర్నడో బీభత్సం సృష్టించింది. కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి. తీవ్రమైన గాలుల కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.
భారీ తుపాన్..
హగీబిస్ తుపాను ఈ రోజు సాయంత్రం తూర్పు జపాన్ తీరాన్ని తాకుతుందని ఆ దేశ వాతావరణ శాఖ(జేఎంఏ) తెలిపింది. సుమారు 216 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. భారీ ఎత్తున అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని వెల్లడించింది.
ఏటా సుమారు 20 తుపాన్లు జపాన్ను ముంచెత్తుతూనే ఉంటాయి. అయితే.. 1991 తర్వాత ఆ స్థాయి భారీ తుపానుగా హగీబిస్ను గుర్తించింది జేఎంఏ.
సహాయక చర్యలు
తుపాను వల్ల ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తుపాను ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన పట్టణాలు, గ్రామాల నుంచి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు.
ఇప్పటికే సుమారు 16 లక్షల మందిని రక్షిత ప్రాంతాలకు చేరవేశారు. ఆహార పదార్థాలు నిల్వ చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
ప్రపంచ కప్ మ్యాచ్‌లు రద్దు
భారీ తుపాను కారణంగా రెండు రగ్బీ ప్రపంచకప్ మ్యాచ్‌ల రద్దుతో పాటు జపాన్ గ్రాండ్ ప్రిక్స్ (ఫార్ములా1 రేస్)కు అంతరాయం ఏర్పడింది. 1,600కుపైగా దేశీయ, 260కిపైగా అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేశారు.
ఇదీ చూడండి: కార్చిచ్చుతో అగ్రరాజ్యం గజగజ... వేలాది ఇళ్లు ఖాళీ