Omicron variant cases in world: ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ గడగడలాడిస్తోంది. కొత్త వేరియంట్ వార్తలతో ప్రజలు వణికిపోతున్నారు. కొవిడ్ అలజడి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అంతర్జాతీయ ఆరోగ్య వ్యవస్థపై ఒమిక్రాన్ ప్రభావం ఎంత ఉంటుంది? అన్న ప్రశ్న ఇప్పుడు అందరిని భయపెడుతోంది. ఈ తరుణంలో మరిన్ని దేశాలు ఒమిక్రాన్ ప్రభావిత ప్రాంతాలుగా మారుతున్నాయి. రోజుకో దేశంలో వైరస్ ఆనవాళ్లు బయటపడుతున్నాయి.
- కొత్త వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థను దక్షిణాఫ్రికా హెచ్చరించకముందే.. తమ దేశంలోకి ఒమిక్రాన్ వ్యాపించి ఉంటుందని నెథర్లాండ్స్ వెల్లడించింది. ఈ నెల 24న కొత్త వేరియంట్ గురించి డబ్ల్యూహెచ్ఓకు దక్షిణాఫ్రికా చెప్పిందని.. అయితే తమ దేశంలో 19 నుంచి 23 మధ్య తీసిన నమూనాల్లో ఒమిక్రాన్‌ను గుర్తించినట్టు నెథర్లాండ్స్ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
- అటు హిందూ మహా సముద్రంలోని ఫ్రాన్స్ ద్వీపమైన రీయూనియన్లోనూ ఒమిక్రాన్ కేసు బయటపడింది. 53ఏళ్ల వ్యక్తికి ఈ కొత్త రకం వైరస్ సోకింది. మొజాంబిక్ నుంచి రోగి దక్షిణాఫ్రికాలో దిగి.. అక్కడి నుంచి రీయూనియన్‌కు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తి ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నాడు.
- ఆసియాలోని అనేక ప్రాంతాలకు ఒమిక్రాన్ విస్తరిస్తోంది. తాజాగా.. జపాన్‌లోనూ తొలి కేసు వెలుగులోకి వచ్చింది. నమీబియా నుంచి ఆదివారం టోక్యోకు వచ్చిన ఓ 30ఏళ్ల వ్యక్తిలో ఒమిక్రాన్‌ను గుర్తించారు. అతడిని క్వారంటైన్లో పెట్టి చికిత్స అందిస్తున్నారు. విమానంలో మిగిలిన ప్రయాణికులను గుర్తించి.. వారికి పరీక్ష చేసే పనిలో పడ్డారు అధికారులు. ఈ నేపథ్యంలో ప్రయాణ ఆంక్షలను మరింత కఠినతరం చేస్తామని ఆ దేశ చీఫ్ కెబినెట్ సెక్రటరీ హిరోకాజు మట్సూనో వెల్లడించారు.
- జాంబియా నుంచి భారత్‌కు వచ్చిన ఓ వ్యక్తికి ఈ నెల 25న వైరస్ నిర్ధరణ అయ్యింది. 20న జాంబియా నుంచి ముంబయికి ఆ వ్యక్తి వచ్చాడు. అక్కడి నుంచి పుణెకు ట్యాక్సీలో వెళ్లాడు. అతడికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిందా? లేదా? అని తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. జినోమ్ సీక్వెన్సింగ్ కోసం రోగి నమూనాలను ల్యాబ్‌కు పంపించారు.
విజయం సాధించేనా?
Omicron virus latest news: 2020 తొలినాళ్ల నుంచి ప్రపంచ దేశాలను కొవిడ్ వణికిస్తోంది. టీకా అస్త్రాన్ని ప్రయోగించినా.. ఎప్పటికప్పుడు రూపాంతం చెంది భయపెడుతోంది. ఈ ఏడాది తొలినాళ్లల్లో డెల్టా వేరియంట్ అనేక దేశాల్లో అలజడులు సృష్టించింది. ఆ ప్రభావం నుంచి కోలుకుంటున్న తరుణంలో.. ఒమిక్రాన్‌గా వైరస్ రూపాంతరం చెందడం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఒమిక్రాన్.. అత్యంత ప్రమాదకరమని, దాని వ్యాప్తి అత్యంత వేగంగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్‌ను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ సైతం సూచించింది.
ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్‌పై పోరాటానికి సిద్ధమని ప్రకటించింది ఐరోపా సమాఖ్య. 'ఏదో ఒక రోజున మ్యుటేషన్ పుట్టుకొస్తుందని, ఫలితంగా ప్రస్తుతం పాటిస్తున్న విధానాలు మార్చుకోవాలని మాకు ముందే తెలుసు. అందుకు తగ్గట్టుగానే మేమూ సిద్ధమయ్యాము,' అని ఈయూ మెడికల్ ఏజెన్సీ చీఫ్ ఎమర్ కూక్ తెలిపారు. అయితే ప్రస్తుతమున్న కొవిడ్ టీకాలు కొత్త వేరియంట్‌పై పనిచేస్తాయా అన్న విషయం తెలియాలంటే.. కనీసం రెండు వారాలు వేచిచూడాల్సిందేనని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:-