ఇస్లామాబాద్ హైకోర్టులో కుల్‌భూషణ్ జాదవ్ తరఫున వాదనలు వినిపించేందుకు.. భారత న్యాయవాదికి అవకాశమివ్వడం న్యాయపరంగా సాధ్యమయ్యే పనికాదని పాకిస్థాన్ వెల్లడించింది. భారత్ అసంబద్ధమైన డిమాండ్లు చేస్తోందని పాక్ విదేశాంగశాఖ ప్రతినిధి షాహిద్ హఫీజ్ చౌద్రి పేర్కొన్నారు.
"జాదవ్ తరఫున వాదనలు వినిపించేందుకు తమ న్యాయవాదికి అనుమతినివ్వాలన్న భారత్ డిమాండ్ అసంబద్ధమైనది. కేవలం పాక్‌లోని న్యాయవాదులకే ఆ అవకాశముందని అనేకమార్లు స్పష్టం చేశాం. ఇతర దేశాలు కూడా ఇదే విధానాన్ని పాటిస్తున్నాయి. విదేశీయులు దేశంలోని న్యాయవాద వృత్తిని ప్రాక్టీస్ చేయలేరని భారత సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది."
--- షాహిద్ హఫీజ్ చౌద్రి, పాక్ విదేశాంగశాఖ ప్రతినిధి.
భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ కేసులో పాకిస్థాన్ దాఖలు చేసిన పునఃసమీక్షా పిటిషన్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం వచ్చే నెల 3న విచారించనుంది. ఈ నేపథ్యంలోనే తమ న్యాయవాదికి అనుమతినివ్వాలని భారత్ డిమాండ్ చేస్తోంది.
2017 ఏప్రిల్‌లో గూఢచర్యం, ఉగ్రవాద కార్యకలాపాల ఆరోపణలతో కుల్‌భూషణ్‌కు మరణశిక్ష విధించింది పాక్ మిలిటరీ కోర్టు. అయితే పాక్ కోర్టు తీర్పుపై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) గతంలో విచారణ జరిపింది. పటిష్ఠ పున:సమీక్ష జరపాలని ఐసీజే తీర్పునిచ్చింది.
ఇదీ చూడండి:- 'కుల్‌భూషణ్‌ను కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం'