అమెరికాతో చర్చలు జరపటం సహా ఆ దేశాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఉత్తరకొరియా దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ తన యంత్రాంగాన్ని ఆదేశించారు. అయితే.. చర్చల కంటే కూడా.. అమెరికాతో సంఘర్షణపైనే ఎక్కువ దృష్టిసారించాలని తెలిపారు. ఈ మేరకు ఉత్తర కొరియా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మీడియా శుక్రవారం తెలిపింది. ఉత్తర కొరియా తమ అణు కార్యకలాపాలకు స్వస్తి చెప్పి, చర్చలకు రావాలని అమెరికా సహా ఇతర దేశాలు కోరిన కొన్ని రోజుల తర్వాత కిమ్ నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.
కిమ్ తాజా ప్రకటనతో.. అణుకార్యకలాపాల్లో తమ దూకుడును పెంచి, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు కిమ్ యోచిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో చర్చలకు కూడా ఆయన సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. గురువారం జరిగిన తమ పార్టీ సమావేశంలో.. అమెరికాతో అనుసరించాల్సిన వ్యూహాలపై కిమ్ చర్చించారని 'కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ' పేర్కొంది. తమ దేశ గౌరవాన్ని కాపాడుకునేందుకు, శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు.. అమెరికాతో పోరుకు సిద్ధంగా ఉండాలని చెప్పినట్లు తెలిపింది.
ఇదీ చూడండి: అత్యంత దారుణ పరిస్థితుల్లో ఉత్తర కొరియా: కిమ్
ఇదీ చూడండి: మనకు ఆకలి కేకలు తప్పవు: కిమ్