కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు రాజుకొంటున్నాయి. సెప్టెంబరులో ఉత్తర, దక్షిణ కొరియాలు రోజుల వ్యవధిలో పోటాపోటీగా క్షిపణి పరీక్షలు (North Korea Missile) నిర్వహించాయి. వీటిపై అమెరికా 'వ్యూహాత్మక సహనం' ప్రదర్శిస్తోంది. మరోవైపు ఉత్తర కొరియా తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటోంది. దాంతో ఆ దేశ పాలకుడైన కిమ్ జోంగ్ ఉన్ తన వంశానికి బాగా ఒంటపట్టిన బెదిరింపుల దౌత్య వ్యూహాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో 2018లో మూసేసిన యాంగ్‌బిన్ అణు రియాక్టరును మళ్ళీ తెరిపించడంతోపాటు క్షిపణి పరీక్షలనూ చేపట్టారు. ఇటీవల ఐరాసలో (UNO) ఉత్తర కొరియా ప్రతినిధి కిమ్‌సంగ్ ప్రసంగిస్తూ ఆయుధాలను పరీక్షించే హక్కు తమకుందని సమర్థించుకొన్నారు. అనంతరం 48 గంటల్లోనే హైపర్ సోనిక్ క్షిపణిని పరీక్షించినట్లు ఆ దేశం ప్రకటించింది.
బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో కిమ్ జోంగ్ ఉన్‌ను హంతకుడితో పోల్చారు. శ్వేతసౌధంలోకి అడుగుపెట్టాక కిమ్‌తో చర్చలకు సిద్ధమనే సంకేతం పంపారు. అటువైపు నుంచి స్పందన కరవైంది. ఉత్తర కొరియా అణ్వాయుధాలకు కావాల్సిన ప్లుటోనియాన్ని యాంగ్‌బిన్ ఒక్కటే ఉత్పత్తి చేస్తుంది. ఆ రియాక్టర్‌లో అనుమానాస్పద కార్యకలాపాలు సాగుతున్న విషయాన్ని ఆగస్టులో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) కూడా ధ్రువీకరించింది. ఈ ఏడాది సెప్టెంబరులో మూడు సరికొత్త క్షిపణులను ఉత్తర కొరియా బాహ్యప్రపంచానికి చూపింది. 1,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే క్రూయిజ్ క్షిపణిని తొలిసారి పరీక్షించింది. ఇది జపాన్‌లోని ఒకినావాలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని అభివృద్ధి చేసిన ఆయుధం. రైలుపై నుంచి బాలిస్టిక్ క్షిపణినీ ప్రయోగించింది. ఐరాస సర్వసభ్య సమావేశం ముగిసిన తరవాత అణ్వాయుధ ప్రయోగ సామర్థ్యమున్న హైపర్‌సోనిక్ క్షిపణిని పరీక్షించినట్లు ప్రకటించింది. ఈ పరిణామాలను విశ్లేషిస్తే... ప్రపంచానికి అణుబూచిని చూపేందుకు ఉత్తర కొరియా ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుంది.
దక్షిణ కొరియా సైనిక పాలనలో ఉండగా 1979లో అమెరికా ఆ దేశం ఉత్పత్తి చేసే క్షిపణులు 110 మైళ్ల దూరాన్ని దాటకుండా ఆంక్షలు విధించింది. మరోవైపు ఉత్తర కొరియా విచ్చలవిడిగా ఆయుధ సంపత్తి పెంచుకొంటూ పోతోంది. దీంతో దక్షిణ కొరియా ఉత్పత్తి చేసే క్షిపణుల పరిధిపై ఆంక్షలను అమెరికా సడలిస్తూ వచ్చింది. వార్‌హెడ్లపై ఉన్న 500 కిలోల పరిమితిని 2017లో ట్రంప్ సర్కారు తొలగించింది. ఫలితంగా 2,000 కిలోల వార్‌హెడ్లను దక్షిణ కొరియా అభివృద్ధి చేసింది. ఈ ఏడాది మే నెలలో ఆ దేశాధినేత మూన్ జె-ఇన్ శ్వేతసౌధంలో బైడెన్‌తో భేటీ అయ్యారు. అనంతరం సియోల్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమంపై నాలుగు దశాబ్దాలుగా ఉన్న ఆంక్షలు తొలగిపోయాయి. సాంకేతిక పరిజ్ఞానంలో ఉన్నత స్థానంలో ఉన్న దక్షిణ కొరియా ఖండాంతర క్షిపణిని అభివృద్ధి చేస్తే... చైనా, రష్యా, ఉత్తర కొరియాలపై ఏకకాలంలో ఒత్తిడి పెరుగుతుందన్నది అమెరికా వ్యూహం. సియోల్ సరికొత్తగా అభివృద్ధి చేసిన హన్‌మూ 4-4 జలాంతర్గామి నుంచి ఈ ఏడాది సెప్టెంబరులో బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. ఉత్తర కొరియాలో కాంక్రీట్ బంకర్లు, గుహల్లో భద్రపర్చిన ఆయుధాలను ధ్వంసం చేసేందుకు దీన్ని తయారు చేశారు. ఈ పరీక్షపై కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్‌యో జోంగ్ స్పందిస్తూ ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా ధ్వంసమయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. ఇదే జరిగితే కిమ్ సర్కారుకే నష్టం.
ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం పతాకస్థాయిలో ఉంది. కొవిడ్ భయంతో చైనా వైపు సరిహద్దులు మూసివేసింది. ఐరాస ఆంక్షలవల్ల ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకొనే అవకాశం లేదు. దీంతో ఉత్తర కొరియా పాలకులపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో అమెరికాను ఎలాగైనా చర్చలకు ఒప్పించేలా ఒత్తిడి పెంచేందుకు వరస క్షిపణి ప్రయోగాలు చేపడుతోంది. ఇది పెద్దగా ఫలితం ఇవ్వడంలేదని అర్థం చేసుకొని అమెరికాతో చర్చలకు సిద్ధమనే సంకేతాలను ఇస్తోంది. అమెరికా కూడా ప్యాంగ్యాంగ్‌కు సాయమందించేందుకు సిద్ధమని ప్రకటించింది. అనంతరం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉత్తర కొరియాకు అవసరమైన సామగ్రిని సరఫరా చేస్తోంది. సాయం అందాక ఉత్తర కొరియా మళ్లీ ఉద్రిక్తతలను రాజేయదనే నమ్మకం మాత్రం లేదు.
- పి.కిరణ్
ఇదీ చూడండి: డ్రగ్స్ బానిసలకు తాలిబన్ల 'ట్రీట్మెంట్'- తిండి పెట్టకుండా...