దక్షిణ కొరియాతో (south korea news) సంబంధాలను పునరుద్ధరించేందుకు సుముఖత వ్యక్తం చేశారు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్(north korea president). అక్టోబర్ తొలినాళ్లలోనే ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సూత్రప్రాయంగా తెలిపారు. మరోవైపు.. అమెరికాపై విమర్శలు గుప్పించారు కిమ్(north korea criticizes us). చర్చలకు పిలవటం తమ పట్ల శత్రుత్వాన్ని కప్పిపుచ్చుకునే నీచమైన ఆలోచనగా అభివర్ణించారు.

పార్లమెంట్లో బుధవారం పలు అంశాలపై ప్రసంగించారు కిమ్ జోంగ్ ఉన్. ఏడాదికిపైగా మూసి ఉన్న సరిహద్దులను తెరిచేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
"ఉభయ కొరియాల మధ్య శాంతి స్థాపనను ప్రజలు కోరుకుంటున్నారు. అయితే.. ఇరు దేశాల మధ్య తలెత్తిన సమస్యలను స్వతంత్రంగా పరిష్కరించడానికి ప్రయత్నించేందుకు బదులుగా.. అమెరికా, అంతర్జాతీయ సహకారాన్ని దక్షిణ కొరియా కోరుకోవటం సరికాదు. సోదరి కిమ్ యో జోంగ్ చెప్పినట్లు దక్షిణ కొరియా ద్వంద్వ వైఖరిని విడనాడాలి. ఉభయ కొరియాల మధ్య సంబంధాలు క్లిష్టమైన కూడలిలో ఉన్నాయి."
- కిమ్ జోంగ్ ఉన్, ఉత్తర కొరియా అధినేత
సంక్షోభం నుంచి బయటపడేందుకు..!
కిమ్ ప్రకటన.. సియోల్, వాషింగ్టన్ మధ్య చీలిక తెచ్చే ప్రయత్నంగా స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా నేతృత్వంలో విధించిన ఆంక్షలు, ఇతర చర్యల కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు దక్షిణ కొరియా సాయాన్ని కిమ్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం క్షిపణి పరీక్షలు చేపట్టిన ఉత్తర కొరియా.. అమెరికాపై విమర్శలు దాడిని పెంచింది. అలాగే.. దక్షిణ కొరియాతో షరతులతో కూడిన చర్చలకు పిలుపునిచ్చింది.
ఉత్తర కొరియా ఇటీవల చేపట్టిన క్షిపణి పరీక్షలపై తక్షణం చర్చించాలని అమెరికా, యూకే, ఫ్రాన్స్ అభ్యర్థన మేరకు గురువారం అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసింది ఐరాస భద్రతా మండలి.
దక్షిణ కొరియా సుముఖమే.. కానీ
సరిహద్దులను పునరుద్ధరించేందుకు సన్నద్ధమవుతామని, కానీ, పెండింగ్‌లో ఉన్న చాలా సమస్యలపై చర్చించి, పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది దక్షిణ కొరియా.
కిమ్ సోదరికి కీలక బాధ్యతలు..
కొద్ది రోజుల క్రితం జరిగిన సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ సమావేశాల్లో.. కిమ్ నేతృత్వంలోని దేశ వ్యవహారాల కమిషన్ సభ్యురాలుగా ఆయన సోదరి కిమ్ యో జోంగ్‌ను(kim jong un sister) ఎన్నుకున్నారు. ఆమె ఇప్పటికే.. వర్కర్స్ పార్టీ సీనియర్ నేతగా.. దక్షిణ కొరియాతో సంబంధాలను చూస్తున్నారు. ప్రస్తుతం మరో బాధ్యత అప్పగించటం.. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రభుత్వంలో తమ కుటుంబ సభ్యుల పాత్ర ఉండాలని కిమ్ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఇదీ చూడండి: క్షిపణి పరీక్షపై ఉత్తర కొరియా క్లారిటీ