కరోనా వైరస్ మహమ్మారి ధాటికి ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. నిత్యం వేల సంఖ్యలో కేసులు, వందల మరణాలు సంభవిస్తుండడంతో ఆయా దేశాల్లో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో వైరస్ తీవ్రతను అదుపుచేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మహమ్మారిని నియంత్రించడంలో న్యూజిలాండ్ విజయం సాధించిందనే చెప్పవచ్చు. గడిచిన మూడు నెలల్లో ఇక్కడ కేవలం ఒకేఒక్క కరోనా మరణం నమోదయ్యింది. మే 24 తర్వాత తాజాగా మరో కొవిడ్ మరణం చోటుచేసుకుంది. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా మరణాల సంఖ్య 23కుచేరింది.
ప్రపంచదేశాలను వణికిస్తున్నప్పటికీ న్యూజిలాండ్‌లో వైరస్ తీవ్రత తక్కువగానే ఉంది. సమీప దేశమైన ఆస్ట్రేలియాలోనూ పలుచోట్ల వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. విదేశీ ప్రయాణాలు లేకపోవడం, కాంటాక్ట్ ట్రేసింగ్ వంటి చర్యలతో దేశంలో కరోనా వైరస్ తీవ్రత అదుపులోనే ఉంది. అయితే, గతనెలలో ఆక్లాండ్‌లో తిరిగి వైరస్ బయటపడింది. దీన్ని నియంత్రించేందుకు అక్కడ రెండు వారాలకుపైగా లాక్‌డౌన్ విధించారు. తాజాగా లాక్‌డౌన్ కాలం ముగుస్తున్న సమయంలోనే యాభై ఏళ్ల వ్యక్తి కొవిడ్ సోకి మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ కొవిడ్ అప్రమత్తత లెవల్-2.5గా నిర్ధారించిన అధికారులు, పది మంది కంటే ఎక్కువగా ప్రజలు సమూహాలుగా ఏర్పడవద్దని సూచించారు. దాదాపు 102 రోజుల తర్వాత నగరంలో పాజిటివ్ కేసు బయటపడినట్లు అధికారులు తెలిపారు.
అయితే, దేశవ్యాప్తంగా సెప్టెంబర్ రెండోవారం వరకు కొవిడ్ నియంత్రణ ఆంక్షలు కొనసాగుతాయని ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ స్పష్టంచేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొవిడ్ అప్రమత్తత లెవల్-2 గా ప్రకటించారు. దీని ద్వారా ప్రతిఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించడం తప్పనిసరి. వంద మంది కంటే ఎక్కువ మంది సమూహాలుగా ఏర్పడకూడదు. ఇదిలాఉంటే, జాన్స్‌హాప్కిన్స్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం, న్యూజిలాండ్‌లో ఇప్పటివరకు 1764 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ప్రస్తుతం 112కేసులు మాత్రమే యాక్టివ్ ఉన్నట్లు అక్కడి వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే అత్యంత కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ ఎలా వ్యాప్తి చెందిందనే విషయం మిస్టరీగా ఉన్నట్లు అక్కడి అధికారులు అభిప్రాయపడుతున్నారు.