భూమి కంపించినట్లు అనిపిస్తే ఎవరైనా హడలిపోయి పరుగులు పెడతారు. న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ మాత్రం అలా చేయలేదు. భూకంపాన్ని లెక్కచేయకుండా తన టీవీ ఇంటర్వ్యూను యథావిధిగా కొనసాగించారు.
న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్లో సోమవారం ఉదయం 8 గంటల సమయంలో భూకంపం సంభవించింది. అదే సమయంలో లైవ్ టీవీ ఇంటర్వ్యూలో ఉన్నారు జెసిండా. భూమి కంపించిన విషయాన్ని గమనించి కొన్ని క్షణాల పాటు ఆగారు. పార్లమెంటు ఆవరణలో భూప్రకంపనలు వచ్చాయని, వెంటనే ఆగిపోయాయని, ఈ విషయాన్ని మీరు గమనిస్తున్నారా? అని వార్తాసంస్థ ప్రతినిధికి లైవ్‌లోనే అడిగారు. ఆ సమయంలో ఆమె ఎలాంటి భయాందోళనకు గురికాకపోవడం ఆశ్చర్యపరిచింది.
వెల్లింగ్టన్కు ఈశాన్యంలో 100 కి.మీ దూరంలోని సముద్రంలో భూకంప కేంద్రం నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రత నమోదైనట్లు పేర్కొంది.
వేలాదిమంది న్యూజిలాండ్ వాసులు తమ పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఉదయాన్నే భూకంపం వచ్చింది. ఈ ధాటికి ఇళ్లలోని వస్తువులు పడిపోయాయి. రైల్వే సేవలను నిలిపివేశారు. అయితే ఎక్కడా పెద్దగా నష్టం జరిగినట్లు గానీ, గాయపడినట్లు గానీ సమాచారం లేదు.
న్యూజిలాండ్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2011లో క్రైస్ట్‌చర్చ్‌లో వచ్చిన భారీ భూకంపం 185 మంది ప్రాణాలను బలిగొంది. తీవ్ర ఆస్తినష్టం కలిగించింది.