కరోనా వైరస్ సంక్షోభం వినోద రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ప్రపంచదేశాలు లాక్‌డౌన్ పాటించడం వల్ల థియేటర్లు మూతపడగా, షూటింగ్‌లు నిలిచిపోయాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత విభావరులు నిర్వహించే ఆడిటోరియాలు మూసేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడు, ఎలా షూటింగ్‌లు ప్రారంభించాలి? థియేటర్లు ఎలా ఓపెన్ చేయాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అందరూ మల్లగుల్లాలు పడుతుంటే.. కొన్ని దేశాల ప్రయత్నాలు మనకు ఓ ఉదాహరణగా మారాయి. ఇలా చేస్తే.. భౌతిక దూరం పాటిస్తూనే సినిమాలు ఎంజాయ్ చేయొచ్చని చెప్తున్నాయి.
దక్షిణ కొరియాలో...
మే 23న దక్షిణకొరియాలో మ్యూజికల్ ఫెస్ట్ జరిగింది. దీనికి వందల్లో జనం హాజరయ్యారు. అయితే దీనికి కార్లలోనే రావాల్సి ఉంటుంది. ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. వీటికి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైన పద్ధతులతో భౌతిక దూరం నిబంధనలు పాటించకపోవడం అనే మాటే ఉండదు.
దూబాయ్‌లో..
దుబాయ్‌లోని వోక్స్ సినిమాస్ ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో సినిమాలు ప్రదర్శించేందుకు సిద్ధమైంది. సినిమా చూసేందుకు వచ్చే వాళ్లు తమ సొంత వాహనాన్ని తీసుకుని రావాలి. అందులో కేవలం ఇద్దరు మాత్రమే ఉండాలి. అప్పుడే సినిమా చూసేందుకు అనుమతి ఇస్తారు. టికెట్ల ధర రూ. 3,700. ఇందులోనే పాప్‌కార్న్, స్నాక్స్, డ్రింక్స్ కూడా ఇస్తారు. ఒకసారి 75 కార్లకు మాత్రమే అనుమతి ఉంటుంది.
ఈ ఆలోచన సక్సెస్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ ఎయిర్ థియేటర్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్‌లోనూ పరిమిత సంఖ్యలో ఇలాంటి థియేటర్లు ఉన్నాయి. వాటి సంఖ్య పెరిగితే భవిష్యత్తులో.. వినోదరంగం మరింత జోరందుకోవచ్చు.