ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకుండా రాజకీయ సంక్షోభం తలెత్తిన ఇజ్రాయెల్లో ప్రధాన విపక్షం సైతం ప్రభుత్వ ఏర్పాటు చేయడంలో విఫలమైంది. అంతకుముందు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయినందున... ప్రత్యర్థికి అవకాశం కల్పించారు.
ప్రభుత్వ ఏర్పాటుకు ఇచ్చిన 28 రోజుల గడువు బుధవారం ముగిసింది. ఎన్నికల్లో రెండో అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న బ్లూ అండ్ వైట్ పార్టీ అధినేత బెన్నీ గంట్జ్ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మద్దతును కూడగట్టలేకపోయారు. ఫలితంగా ఇజ్రాయెల్లో మరోసారి ఎన్నికలు జరిగే పరిస్థితి తలెత్తింది. ఆ దేశంలో ఇప్పటికే ఈ ఏడాది రెండు సార్లు ఎన్నికలు జరిగాయి.
మరి ఇప్పుడేంటి?
ఇజ్రాయెల్ చట్టం ప్రకారం ఇప్పుడు రెండు ప్రధాన పార్టీలకు మరో 21 రోజల ప్రత్యేక సమయం ఇస్తారు. ఈ గడువులోగా ఏదో ఒక పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం కూడగట్టాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఇజ్రాయెల్ ప్రజల కోసం మంచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు గంట్జ్.
తర్వాతా ఇదే ఫలితం..!
120 స్థానాలున్న ఇజ్రాయెల్ పార్లమెంట్లో ఆధిక్యం కోసం 61 స్థానాలు అవసరం. గత ఎన్నికల్లో అన్ని పార్టీలు ఆ సంఖ్యకు ఆమడ దురంలో నిలిచాయి. 33 స్థానాలతో బ్లూ అండ్ వైట్ పార్టీ పార్లమెంట్లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. నెతన్యాహు సారథ్యంలోని అధికార పార్టీ లికుడ్ 32 స్థానాలకు పరిమితమైంది.
ప్రభుత్వ ఏర్పాటులో అన్ని పక్షాలు విఫలమైతే మార్చిలో మరోసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఆ ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే వస్తాయని తెలుస్తోంది.