భారత భూగాలైన కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురాలతో ఇటీవల విడుదల చేసిన కొత్త మ్యాప్‌ను అంతర్జాతీయ సమాజానికి పంపాలని భావిస్తున్నట్లు ప్రకటించింది నేపాల్. ఆగస్టు మధ్య నాటికి భారత్, గూగుల్ సహా ఐక్యరాజ్యసమితి భాగస్వామ్య సంస్థలకు పంపాలని నిర్ణయించినట్లు ఆ దేశ భూ నిర్వహణ శాఖ మంత్రి తెలిపారు.
"కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా భూబాగాలు ఉన్న నవీకరించిన మ్యాప్‌ను వివిధ ఐక్యరాజ్యసమితి భాగస్వామ్య సంస్థలు, గూగుల్, భారత్ సహా అంతర్జాతీయ సమాజాలకు త్వరలోనే పంపుతాం. ఆగస్టు మధ్య నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుంది."
- పద్మ ఆర్యాల్, భూ నిర్వహణ, సహకారం, పేదరిక నిర్మూలన శాఖ మంత్రి.
4 వేల కాపీలు..
ప్రపంచ దేశాలకు పంపేందుకు నేపాల్ కొత్త మ్యాప్‌లను ఆంగ్ల భాషలో 4 వేల కాపీలు సిద్ధ చేయాలని కొలతల శాఖను ఆదేశించారు మంత్రి. ఇప్పటికే 25వేల కొత్త మ్యాప్ కాపీలు ప్రింట్ చేసింది కొలతల శాఖ. వీటిని దేశవ్యాప్తంగా పంపిణీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు ఉచితంగా ఇవ్వగా ప్రజలకు ఆ దేశ కరెన్సీ రూ. 50కి అందుబాటులో ఉంచారు.
మే 20న విడుదల..
భారత భూభాగాలైన కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురాలను కలుపుకుని కొత్త మ్యాప్‌ను మే 20 విడుదల చేసింది నేపాల్ ప్రభుత్వం. దానికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
నేపాల్ ఏకపక్ష నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఎలాంటి చారిత్రక ఆధారాలు లేకుండా నిర్ణయం తీసుకున్నారని మండిపడింది. ఈ నిర్ణయం ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తుందని హెచ్చరించింది. దౌత్య చర్చల ద్వారానే సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది.
ఇదీ చూడండి: 'భారత్-చైనా బంధమే ఆసియా భవిష్యత్తును నిర్ణయిస్తుంది'