మూడు రోజుల్లో మెజారిటీ నిరూపించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నేపాల్ రాష్ట్రపతి విద్యా దేవి భండారి ప్రతిపక్షాలను ఆహ్వానించారు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ.. ప్రతినిధుల సభలో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో.. ప్రతిపక్ష పార్టీల బలనిరూపణకు అవకాశం కల్పించారు రాష్ట్రపతి. గురువారం 9 గంటలకల్లా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
275 మంది సభ్యులు గల నేపాల్ పార్లమెంట్లో ఇతర పార్టీల మద్దతుతో విజయం సాధిస్తానని ఓలి భావించారు. కానీ, విశ్వాస పరీక్షలో ఓలీకి 93 ఓట్లే వచ్చాయి. 124 మంది ఓలీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. సీపీఎన్ మావోయిస్ట్ అధ్యక్షుడు పుష్ప కమల్ దహల్ మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల ఓలీ మెజారిటీని కోల్పోయారు.
ఈ క్రమంలో నేపాల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 76(2) ప్రకారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని రాష్ట్రపతిని కోరాయి ప్రతిపక్ష పార్టీలు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్, సీపీఎన్ మావోయిస్ట్ అధ్యక్షుడు పుష్ప కమల్ దహల్, జనతా సమాజ్ వాదీ పార్టీ నేత ఒకరు ఉమ్మడి ప్రకటన చేశారు.
ప్రస్తుతం.. ప్రతిపక్షాలు బలనిరూపణలో విఫలమైతే రాష్ట్రపతి ఆర్టికల్76(3)ని అమలు చేయనున్నారు. ఒకవేళ ఈ ఆర్టికల్ అమలైతే ఓలీ మళ్లీ ప్రధాని బాధ్యతలు స్వీకరిస్తారు. కానీ.. పీఎం బాధ్యతలు చేపట్టిన 30 రోజుల్లో ఓలీ విశ్వాసపరీక్షల్లో నెగ్గాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి:మెజారిటీ కోల్పోయిన ఓలీ సర్కారు