భారీ వర్షాలు, వరదలతో హిమాలయ దేశం నేపాల్ అతలాకుతలమవుతోంది. గురువారం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మృతుల సంఖ్య 67కు పెరిగింది. మరో 30 మంది గల్లంతయ్యారు. దేశవ్యాప్తంగా 25 జిల్లాల్లోని వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిన అధికారులు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
మరోవైపు వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా నేపాల్‌లోని దాదాపు 14 హైవేలపై రాకపోకలను నిలిపేశారు అధికారులు. భారీ వర్షాలతో నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరికొద్ది రోజులు వాతావరణం ఇలాగే కొనసాగే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
అంతర్జాతీయ సంస్థలకు నేపాల్ అభ్యర్థన
వరదల కారణంగా టైఫాయిడ్, మలేరియా, డెంగీ, కలరాతో పాటు మరిన్ని అంటు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రోగాల బారిన పడకుండా తమ దేశస్థులను రక్షించాలని నేపాల్ ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థలను అభ్యర్థించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ తదితర అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో నేపాల్ ఆరోగ్య శాఖ యంత్రాంగం అత్యవసరంగా సమావేశమైంది. వరద ప్రభావిత ప్రాంతాలకు తమ బృందాలను పంపి ప్రజలకు అవసరమైన వైద్యం అందించాలని ఈ సంస్థలను కోరింది.
పాక్ అక్రమితి కశ్మీర్లోనూ ఇదే పరిస్థితి
పాక్ అక్రమిత కశ్మీర్లోని నీలమ్ వ్యాలీలోనూ వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలకు దాదాపు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గల్లంతయ్యారు.