కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మరోమారు ఆయుధ పరీక్షను నిర్వహించింది ఉత్తరకొరియా. 12 రోజుల్లో కిమ్ సర్కారు నిర్వహించిన 4వ ఆయుధ పరీక్ష ఇది.
రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లుగా దక్షిణ కొరియా అనుమానం వ్యక్తం చేసింది. 450 కిలోమీటర్లు ప్రయాణించిన ఈ క్షిపణలు జపాన్ సముద్రం సమీపంలో పడ్డాయి.
నిజానికీ ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాలపై ఐరాస భద్రతా మండలి నిషేధం విధించింది. అయితే తాము 'లార్జ్ కాలిబర్ మల్టిపుల్ లాంచ్ గైడెడ్ రాకెట్ సిస్టమ్'ను పరీక్షించామని ఉత్తరకొరియా తెలిపింది.
'విన్యాసాలు ఆపేయాలి'
అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా నిర్వహిస్తోన్న సైనిక విన్యాసాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ ప్రయోగాలు నిర్వహిస్తున్నామని స్పష్టంచేసింది ఉత్తరకొరియా. విన్యాసాలను ఆపేయాలని, లేదంటే మరిన్ని ఆయుధ పరీక్షలు నిర్వహిస్తామని హెచ్చరించింది. ఇదే కొనసాగితే అమెరికాతో చర్చలపై ప్రభావం పడుతుందని, భయంకర హింసకు దారి తీస్తుందని తెలిపింది.
సాధారణంగా ప్రయోగాలు చేసిన మరుసటి రోజు ఇలాంటి ప్రకటనలు చేస్తుంది ఉత్తరకొరియా. కానీ తాజా ప్రయోగం తర్వాత గంట సేపటికే ఈ విషయంపై స్పందించింది.
ఇదీ చూడండి: 'దారికి రాకపోతే అంతే'... చైనాకు ట్రంప్ హెచ్చరిక