అగ్రరాజ్యంపై అణుదాడి హెచ్చరికలతో తరచూ వార్తల్లో నిలిచే ఉత్తర కొరియా మరోమారు ఆయుధ పరీక్షల బాట పట్టింది. శక్తిమంతమైన వార్హెడ్లను మోసుగెళ్లగల సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. అధినేత కిమ్ జోంగ్ ఉన్ సమక్షంలో ఈ ప్రయోగం జరిగినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది.
నిర్ధరించని దక్షిణకొరియా...
ఉత్తరకొరియా ఎలాంటి క్షిపణి నిర్వహించే అవకాశం లేదని స్పష్టం చేస్తోంది పొరుగునే ఉన్న దక్షిణకొరియా. ఒకవేళ అది క్షిపణి అయితే.. తమ రాడార్లు పసిగట్టేవని ఆ దేశ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
ఒత్తిడి తెచ్చేందుకే...
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఇటీవల వియత్నాం హనోయిలో అణుచర్చలు.. ఎలాంటి ఒప్పందం లేకుండానే అర్ధంతరంగా ముగిశాయి. చర్చల పునరుద్ధరణ విషయంలో అగ్రరాజ్యం కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఈ విషయంలో అగ్రరాజ్య వైఖరిపై అసంతృప్తిని తెలియజేసేందుకే ఉత్తర కొరియా ఈ పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
"చర్చల్లో అమెరికా వైఖరిపై కిమ్ అసహనంతో ఉన్నారు. అయితే... ఉత్తర కొరియా దీర్ఘశ్రేణి క్షిపణి లేదా అణుపరీక్ష చేయలేదు. అమెరికాతో చర్చలు జరగాలని ఆ దేశం కోరుకుంటోంది అనేందుకు ఇదే నిదర్శనం. అమెరికాతో చర్చలు పూర్తిగా రద్దు చేసుకోవాలని అనుకుంటే తప్ప ఉత్తర కొరియా అలాంటి పరీక్షలు నిర్వహించదు."
-కో యు-వాన్, సియోల్ డోంగ్గుక్ విశ్వవిద్యాలయం ఆచార్యుడు
ఇదీచూడండి: మోదీ కాన్వాయ్, హెలికాప్టర్ తనిఖీ.. ఐఏఎస్‌పై వేటు