మయన్మార్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నోబెల్ శాంతి బహుమతి విజేత ఆంగ్ సాన్ సూకీ (75) మరోసారి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. నేషనల్ లీగ్ డెమొక్రాటిక్ పార్టీ (ఎన్‌ఎల్‌డీ) తరఫున రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సూకీ సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు ఉన్న ఎన్నికల ఫలితాలను మయన్మార్ ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లను ఎన్‌ల్‌డీ సాధించిందని ప్రకటించింది.
కొనసాగుతున్న లెక్కింపు...
నవంబర్ 8న మయన్మార్‌లో సాధారణ ఎన్నికలు జరిగాయి. వీటిలో ఎగువ, దిగువ సభల్లో కలిసి ఎన్‌ఎల్‌డీ 346 సీట్లు సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు 322 సీట్లు మాత్రమే అవసరం కావడంతో ఎన్‌ఎల్‌డీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమైంది. అయితే, ఇంకా కొన్ని చోట్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఎన్‌ఎల్‌డీ ఇప్పటికే ఆధిక్యం సాధించగా.. అక్కడి మిలటరీ మద్దతు ఉన్న యూఎస్‌డీపీ పార్టీకి 25 సీట్లు లభించాయి. మిగతా పార్టీలు మరో 44 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ఎన్నికలు జరిగిన తీరును తప్పుపడుతూ అక్కడి ప్రతిపక్షపార్టీ, ఎన్‌ఎల్‌డీ గెలుపును అంగీకరించబోమని ప్రకటించింది. ఈ వాదనను అక్కడి ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.
ఇదీ చూడండి: ఆంగ్‌సాన్ సూకీకి మోదీ అభినందనలు
ఐదు దశాబ్దాల సుదీర్ఘ సైనిక పాలన అనంతరం మయన్మార్‌లో మొట్టమొదటిసారిగా 2015లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగాయి. నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీ (ఎన్‌ఎల్‌డీ)కి చెందిన సూకీ తొలిసారి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లోనూ సూకీనే రెండోసారి విజయం సాధించారు. దేశవ్యాప్తంగా సూకీ కే ఎక్కువ ప్రజాధరణ ఉండటం, ప్రతిపక్షాల ప్రభావం తక్కువగా ఉండడంతో మరోసారి ఆమె అధికారంలోకి రావడానికి మార్గం సుగమమైంది. అయితే, సూకీ పాలనకు రెఫెరెండంగా భావించిన ఈ ఎన్నికలను ఆమె కూడా ఛాలెంజ్‌గానే తీసుకొని గెలుపొందారు.