మయన్మార్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న సైనిక ప్రభుత్వం.. అక్కడి పౌరుల వ్యక్తిగత హక్కులను హరించేలా ఓ కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టం ప్రకారం.. సాయుధ బలగాలకు ఆటంకం కలిగిస్తే 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని నిరసనకారులను హెచ్చరించింది. అంతేకాకుండా.. తిరుగుబాటు నాయకులపై ద్వేషపూరితమైన చర్యలకు పాల్పడితే దీర్ఘకాలం జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తామని సైనిక సర్కార్ ప్రకటించింది. అక్కడ ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించిన కాసేపటికే.. మిలిటరీ వెబ్‌సైట్‌లో ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.
ఆ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తొలగించి, ఆంగ్ సాన్ సూకీని నిర్బంధించిన నేపథ్యంలో కొద్దిరోజులుగా లక్షలాది మంది ఆందోళన బాటపట్టారు. ఈ క్రమంలో సైనిక నేత సెన్ జెన్ మిన్ యాంగ్ లయింగ్ ఈ రకమైన చట్టాన్ని తీసుకురావడం చర్చనీయాంశమైంది. ఆందోళనలను అణచివేసి నిరసన కారులను అడ్డుకునేందుకే ఈ రకమైన చర్యలకు పాల్పడుతోంది సైనిక ప్రభుత్వం.
మరింత ఉద్ధృతం..
నిర్బంధంలో ఉంచిన తమ ప్రియతమ నేత సూకీని విడుదల చేయడం సహా.. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేస్తున్నారు ఆందోళనకారులు. సోమవారంతో ఆమె నిర్బంధ గడువు ముగుస్తున్నప్పటికీ.. దేశంలో ఆందోళనలు పెద్ద ఎత్తున కొనసాగుతున్న నేపథ్యంలో మరోమారు పొడిగించారు. ఫిబ్రవరి 17 వరకు నిర్బంధంలోనే ఉంటారని ఆమె తరఫు న్యాయవాది ఖిన్ మౌంగ్ జా తెలిపారు. ఈ వార్తతో ఆందోళనలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. దేశవ్యాప్తంగా నిరసనల్ని మరింత ఉద్ధృతం చేస్తూ.. 'తమ నేతలను విడుదల చేయాలని, అరెస్టులను ఆపాలనే నినాదాల'తో ప్లకార్డులు చేతపట్టి రోడ్డెక్కారు.
ఇదీ చదవండి: వార్తలకు డబ్బులిచ్చేలా గూగుల్ భారీ ఒప్పందం