మయన్మార్‌లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం నుంచి అధికారాన్ని స్వాధీనం చేసుకున్న సైనిక నాయకుడు మిన్ ఆంగ్ లయాంగ్ తనను తాను దేశ ప్రధానిగా ప్రకటించుకున్నారు. దేశంలో నెలకొన్న అత్యవసర పరిస్థితిని మరో రెండేళ్లపాటు పొడిగించాలని యోచిస్తున్నట్లు ది హిల్ అనే వార్త సంస్థ పేర్కొంది. రెండేళ్ల లోపు తిరిగి దేశంలో ఎన్నికలు నిర్వహిస్తామని లయాంగ్ పేర్కొన్నట్లు తెలిపింది. మయన్మార్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు పరిష్కారం చూపేలా ఆగ్నేయాసియా దేశాలతో సహకరిస్తానని ప్రతిజ్ఞ చేశారు.
దేశంలో ప్రజాస్వామ్యయుతంగా సాధారణ ఎన్నికలు నిర్వహించడానికి సరైన పరిస్థితులను కల్పించాలి. అందుకోసం తగిన సన్నాహాలు చేయాలి. తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహిస్తామని మాటిస్తున్నాం. ఆగస్టు 2023 నాటికి దేశంలో సాధారణ పరిస్థితిని నెలకొల్పుతాం.
- మిన్ ఆంగ్ లయాంగ్ (మిలటరీ నాయకుడు)
ఫిబ్రవరి 1న ఆంగ్‌సాన్ సూకీ ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు చేసింది. దీంతో ఆ దేశంలో అత్యవసర పరిస్థితిని సైన్యం ప్రకటించింది. అక్కడ జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆమె ఓటర్లను మోసం చేసిందని ఆరోపించింది. తిరుగుబాటు తర్వాత దేశంలో సైనిక ప్రభుత్వాన్ని నెలకొల్పినట్లు కమాండర్ ఇన్ చీఫ్, మయన్మార్ ప్రస్తుత అధినేత సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ లయాంగ్ పేర్కొన్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో అక్రమాలపై దర్యాప్తు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో అవకతవకలపై సూకీ ప్రభుత్వం విచారణ చేయకపోవడం కూడా తిరుగుబాటుకు ఓ కారణమని తెలిపారు. సూకీ ప్రభుత్వం తీసుకున్న కరోనా నివారణ చర్యలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: myanmar: మయన్మార్ నిరసనల్లో 840 మంది మృతి