Myanmar military attack: మయన్మార్ ప్రభుత్వ బలగాలు వాయవ్య ప్రాంతంలోని ఓ చిన్న గ్రామంలో ప్రతీకార చర్యలకు దిగాయి. ఓ మిలిటరీ కాన్వాయ్‌పై దాడి చేశారనే కోపంతో 11 మంది పౌరులను చేతులు కట్టేసి సజీవ దహనం చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
సాగేంగ్ ప్రాంతంలోని డన్ టావ్ గ్రామంలో ఈనెల 7వ తేదీన ఈ దుర్ఘటన జరిగింది. ఆ తర్వాతి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అందులో కొందరు యువకులతో పాటు మొత్తం 11మంది మృతదేహాలు కాలిపోయి, వృత్తాకారంలో పడి ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి.. అధికారాన్ని చేజిక్కించుకున్న సైన్యం ప్రజలపై ఉక్కుపాదం మోపుతోంది.
సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న దృశ్యాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్న వారిని అణచివేసేందుకు చేస్తున్న మిలిటరీ దాడులకు నిదర్శనంగా నిలుస్తున్నాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. 'మంగళవారం ఉదయం 11 గంటలకు 50 మంది సైనికులు గ్రామంలోకి ప్రవేశించారు. ఎవరూ పారిపోకుండా అన్ని దారులను మూసివేశారు. 11 మంది అమాయక పౌరులను అరెస్ట్ చేశారు. వారి చేతులను వెనక్కి కట్టేసి, నిప్పు అంటించారు. అయితే, వారు ఎందుకు అలా చేశారో తెలియదు' అని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు వెల్లడించింది.
40 ఏళ్లలోపు వారే..
డన్టావ్ గ్రామంలోని దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయింది 14-40 ఏళ్ల వారేనని పేర్కొంది మయన్మార్ నేషనల్ యూనిటీ గవర్నమెంట్. ఇస్లామిక్ స్టేక్ ఉగ్రవాదుల క్రూరత్వాన్ని ఈ ఘటన ప్రతిబింబిస్తోందని పేర్కొంది.
మయన్మార్ మిలిటరీ ప్రభుత్వం చేపడుతున్న అరాచకాలను అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చాయి పలు మానవ హక్కుల సంఘాలు.
"సజీవ దహనమైన వారిలో చాలా మంది యువకులు ఉన్నారని, వారంతా చిన్న గ్రామానికి చెందిన వారిగా నాకు తెలిసినవారు చెప్పారు. తరుచుగా ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి. కానీ, ఈ దుర్ఘటన మాత్రమే కెమెరాకు చిక్కింది. ఈ సంఘటన ఆకస్మికంగా, ప్రజలను భయపెట్టేందుకు చేసిన చర్య. "
- మన్ని మౌంగ్, హక్కుల బృందం ప్రతినిధి.
ఖండించిన సైనిక ప్రభుత్వం..
పౌరులను సజీవ దహనం చేశాయన్న వార్తలను ప్రభుత్వం తిరస్కరించింది. అసలు ఆ ప్రాంతంలో భద్రతా దళాలే లేవని పేర్కొంది.
ఇదీ చూడండి: సైనిక పాలనలో అరాచకం- చర్మం ఒలిచి చిత్రహింసలు
నిరసన గళాలపై ఉక్కుపాదం- సైనిక నేతల అతిపోకడ