దేశంలో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువెత్తుతున్న నిరసనలను ఉక్కుపాదంతో అణచివేస్తున్న మయన్మార్ సైన్యం.. ఆందోళనకారులపై కఠిన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది. రాజద్రోహం, అసమ్మతి వెలిబుచ్చడం సహా ప్రభుత్వ కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తే క్రూరమైన శిక్షలు విధిస్తామని హెచ్చరించింది. సుదీర్ఘ జైలు శిక్షలతో పాటు మరణశిక్షలూ అమలు చేస్తామని స్పష్టం చేసింది.
మొత్తం 23 రకాల నేరాలు కోర్ట్ మార్షల్ పరిధిలోకి వస్తాయని సైన్యం పేర్కొంది. ఇక్కడ తీసుకున్న నిర్ణయాలపై అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదని తెలిపింది. అయితే, మరణ శిక్షకు వ్యతిరేకంగా 15 రోజుల్లోగా.. సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ లాయింగ్కు అభ్యర్థన చేసుకోవచ్చని వెల్లడించింది.
మరోవైపు, యాంగూన్లోని న్యాయస్థానాల నియంత్రణను తమ పరిధిలోకి తీసుకోనున్నట్లు సైనిక ప్రభుత్వం ప్రకటించిందని స్థానిక వార్తా సంస్థ 'క్యోడో న్యూస్' తెలిపింది. తాజా చర్యలు అంతర్జాతీయంగా మరింత విమర్శలకు దారితీస్తాయని పేర్కొంది.
149 మంది మృతి
అంతకుముందు, మయన్మార్ సైనిక హింసాకాండలో 149 మంది మరణించారని ఐరాస మానవహక్కుల హైకమిషనర్ ప్రతినిధి రవీనా శందాసని తెలిపారు. 2,084 మందికి పైగా నిర్బంధంలో ఉన్నారని చెప్పారు. ఇటీవల ఐదుగురు కస్టడీలో మరణించారని వెల్లడించారు.
ఇదీ చదవండి: