పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు మరణశిక్ష పడింది. దేశ ద్రోహం కేసులో ప్రత్యేక కోర్టు ఈ మరణశిక్ష విధించినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. మాజీ అధ్యక్షుడికి మరణ శిక్ష విధించడం పాకిస్థాన్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
2007లో అప్పటి అధ్యక్షుడిగా ఉన్న ముషారఫ్ పాకిస్థాన్‌లో అత్యయిక స్థితిని ప్రకటించారు. ఆ దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై గృహ నిర్బంధం విధించారు. అనేక మంది న్యాయమూర్తులను విధుల నుంచి తొలగించారు. మీడియాపై ఆంక్షలు విధించారు. దీంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలో 2013 డిసెంబరులో ఆయనపై దేశ ద్రోహం కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతోంది.
2016 నుంచి దుబాయ్‌లో..
కేసు విచారణ జరుగుతుండగానే 2016 మార్చిలో ముషారఫ్ పాక్ విడిచి వెళ్లిపోయారు. కోర్టుకు హాజరుకావాలని ఎన్నిసార్లు ఆదేశించినా న్యాయస్థానానికి రాలేదు. ఈ కేసు విచారణ చేపట్టిన ప్రత్యేక న్యాయస్థానం నవంబరు 19న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా ఆయనకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.
ముషారఫ్‌కు మరణశిక్ష విధించడాన్ని ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు సమర్థించగా ఒక న్యాయమూర్తి వ్యతిరేకించారు. ప్రస్తుతం ముషారఫ్ దుబాయిలో చికిత్స తీసుకుంటున్నారు.
ఇదీ చూడండి: లైవ్ వీడియో: రోడ్డుపై గింగిరాలు తిరిగిన కారు