సామాజిక మాధ్యమాల్లో ఓ చిన్న పోస్టు ద్వారా కుటుంబానికి అండగా నిలిచారనే వార్తలు చూస్తుంటాం. ఇలాంటి వాటిని అదునుగా చేసుకుని కొందరు దుర్బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో నా కుటుంబం ఆపదలో ఉంది.. ఆదుకోండంటూ తప్పుడు పోస్టులు పెడుతూ రూ.లక్షలు దండుకుంటున్నారు.
ఇలాంటి కేసు దుబాయిలో వెలుగు చూసింది. యూరప్‌కు చెందిన ఓ మహిళ దుబాయిలో ఉంటూ ఆన్లైన్లో బెగ్గింగ్ చేపట్టింది. 'నా భర్త విడాకులు ఇచ్చాడు. పిల్లలను పోషించటం భారంగా మారింది' అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి 17 రోజుల్లోనే సుమారు రూ.35లక్షలు సంపాదించింది. ప్రస్తుతం కటకటాల పాలైంది.
ఇన్స్టాగ్రాం, ట్విట్టర్, ఫేస్బుక్ పోస్టుల ద్వారా ప్రజలను మోసగించి డబ్బు సంపాదించినట్లు తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆ మహిళ వివరాలు వెల్లడించలేదు.
" సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు సృష్టించి తన పిల్లలను పోషించేందుకు భారంగా ఉందంటూ.. వారి చిత్రాలను పెట్టి అడుక్కునేది. ఈ పోస్టులను చూసి పలువురు ఆమెకు నగదు పంపించారు. ఆన్లైన్లో పోస్టులను చూసి విషయం తెలుసుకున్న బంధువులు ఆమె మాజీ భర్తకు తెలియజేశారు. తనపిల్లల ఫొటోలు పెట్టి ప్రజలను మోసం చేస్తోందని ఆయన ఈ-క్రైమ్ విభాగానికి సమాచారం అందించారు. తన పిల్లలు తనవద్దే ఉన్నారని నిరూపిస్తూ ఫిర్యాదు చేశారు."
-బ్రిగేడియర్ అల్ జల్లఫ్, క్రైమ్ విభాగం అధికారి
వీధుల్లో, ఆన్లైన్లో అడుక్కునేవారిని ప్రోత్సహించకూడదని కోరారు బ్రిగేడియర్. ఆన్లైన్ ద్వారా అడుక్కోవడం నేరమని తెలిపారు. ఆన్లైన్ ద్వారా అడుక్కుంటే జైలు శిక్షతో పాటు 25 వేల నుంచి 50 వేల దిర్హామ్‌ల వరకు జరిమాన విధించే అవకాశం ఉందని తెలిపారు.
ఇదీ చూడండి: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జర్దారీ అరెస్ట్