రాయిటర్స్ వార్తా సంస్థలో చీఫ్ ఫొటోగ్రాఫర్‌గా విధులు నిర్వర్తించిన సమయంలో డానిష్ సిద్ధిఖీ.. తీసిన ఎన్నో ఫొటోలు ప్రపంచవ్యాప్తంగా పేరొందాయి. ఈశాన్య దిల్లీ అల్లర్లు, నేపాల్ భూకంపం, కొవిడ్-19 సంక్షోభం, వలస కూలీల దయనీయ స్థితి.. ఇలా ఎన్నో మానవీయ విషాదాలకు ఆయన దృశ్యరూపమిచ్చారు. కొవిడ్-19 మహమ్మారి సమయంలో ఆయన తీసిన ఫొటోలు సంచలనం సృష్టించాయి. రోహింగ్యా శరణార్థుల దీనగాథను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లిన ఆయన ప్రతిష్ఠాత్మక పులిట్జర్ పురస్కారం కూడా అందుకున్నారు. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లకు, అక్కడి భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న భీకర పోరును చిత్రీకరించేందుకు వెళ్లిన ఆయన ప్రాణాలు కోల్పోవడం యావత్ ప్రపంచాన్ని కదిలించింది. ఈ నేపథ్యంలో చిత్రాల రూపంలో సిద్దిఖీని గుర్తుచేసుకుందాం..
పుడమిపై ప్రేమ..
మయన్మార్ సైన్యం దాడులు భరించలేక రోహింగ్యా శరణార్థులు బోట్లలో బంగ్లాదేశ్‌లోకి తరలి వచ్చిన సమయంలో ఓ మహిళ.. అక్కడి నేలను చేతితో తాకుతున్నప్పుడు తీసిన చిత్రమిది. అంతర్జాతీయ సమాజాన్ని కదిలించిన ఈ చిత్రానికే సిద్దిఖీకి పులిట్జర్ అవార్డు దక్కింది.
కరోనా కల్లోలం
కరోనా విలయానికి సజీవ సాక్ష్యం ఈ చిత్రం. మహమ్మారి ఉద్ధృతి సమయంలో దిల్లీలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారికి ఒకేసారి సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో తీసిన ఫొటో..
ఆప్తుల ఆవేదన
కరోనా కారణంగా తమవారిని కోల్పోయిన ఆప్తుల కన్నీటి వేదనను సిద్దీఖీ తన కెమెరాలో బంధించారు.
ఉపాధిలేక.. విధిలేక
గతేడాది కరోనా వల్ల దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించగా.. సొంతూళ్లకు వెళ్లలేక, ఉన్నచోటే జీవనం సాగించలేక వలసకూలీలు అనుభవించిన దీనస్థితికి అద్దం పట్టే చిత్రమిది.
వైరస్ భయం.. సొంతూరే శరణ్యం
లాక్‌డౌన్ విధించడం వల్ల గుజరాత్ నుంచి మహారాష్ట్రకు చేరుకుంటున్న మత్స్యకారుల చిత్రమిది.
మహమ్మారి వేళ.. వనరుల కొరత
కరోనా రెండో దశ ఉద్దృతి సమయంలో దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఆసుపత్రుల్లో పడకలు నిండిపోయాయి. రోగుల రద్దీ పెరగడంతో ఇలా ఒకే బెడ్‌పై ఇద్దరు, ముగ్గురిని ఉంచి చికిత్స అందించారు. ఓ ఆసుపత్రిలో సిద్దీఖీ తీసిన ఈ ఫొటో.. సంచలనం సృష్టించింది.
పోరు బాటలో.. నారీశక్తి
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో రైతన్నలు ఉద్యమం సాగిస్తున్నారు. వారికి మద్దతుగా మహిళలు కూడా ఆందోళనల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిద్దీఖి తీసిన ఫొటో ఇది.
విపత్తు కష్టాలు
దేశ వాణిజ్య రాజధాని ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అక్కడి ప్రజలు మోకాలిలోతు నీటిని దాటుకుంటూ సురక్షిత ప్రాంతానికి వెళ్తుండగా తీసిన చిత్రమిది.
యుద్ధ మేఘాలు
గతేడాది తూర్పు లద్దాఖ్ సరిహద్దు వివాదంతో భారత్, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో లద్దాఖ్‌లో భారత్ భారీగా బలగాలను మోహరించింది. అప్పుడు తీసిన ఫొటో ఇది.
అటు కర్తవ్యం.. ఇటు మానవత్వం
ఫొటోలు తీయడమేకాదు.. సాయంలోనూ సిద్దీఖీ ముందుంటారు. వరదల్లో చిక్కుకున్న ఓ మహిళను పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలిస్తుండగా సిద్దీఖీ కూడా ఆమెకు సాయం చేస్తూనే తన విధులు నిర్వర్తించారు.
ఆఖరి ఫొటో.. చివరి విశ్రాంతి
అఫ్గానిస్థాన్‌లో కాందహార్‌లో గల స్పిన్ బోల్డక్ ప్రాంతాన్ని ఇటీవల తాలిబన్లు ఆక్రమించుకున్నారు. దీంతో తాలిబన్లు, అఫ్గాన్ బలగాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ వార్తను కవర్ చేసేందుకు సిద్దీఖీ.. అఫ్గాన్ దళాలతో కలిసి అక్కడకు వెళ్లారు. అక్కడ ఆయన తీసిన ఆఖరి ఫొటో ఇదే. ఈ ఘర్షణలను కవర్ చేసే సమయంలో 15 గంటల పాటు సుదీర్ఘంగా పనిచేసిన ఆయన మధ్యలో 15 నిమిషాలు పాటు విరామం దొరకడంతో పచ్చికపైనే విశ్రాంతి తీసుకున్నారు. ఈ ఫొటోను ఆయన తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. అదే ఆయన చివరి విశ్రాంతి అయ్యింది. తర్వాత జరిగిన కాల్పుల్లో సిద్దీఖీ మృతిచెందారు.
ఇవీ చదవండి: తాలిబన్ల దాడిలో భారతీయ జర్నలిస్టు మృతి