తనపై విధించిన జైలు శిక్షకు వ్యతిరేకంగా రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ దాఖలు చేసిన పిటిషన్ను మాస్కో సిటీ కోర్టు తిరస్కరించింది. నావల్నీని విడుదల చేయాలని ఐరోపాలోని అత్యున్నత కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. రష్యా కోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
గత ఏడాది విష ప్రయోగానికి గురైన నావల్నీ.. జర్మనీలో దాదాపు ఐదు నెలల చికిత్సతో కోలుకున్నారు. ఈ సమయంలో రష్యా విధించిన నిబంధనల్ని నావల్నీ ఉల్లంఘించారన్న ఆరోపణలతో ఆయనకు రెండు సంవత్సరాల 8 నెలల శిక్ష విధించింది స్థానిక న్యాయస్థానం.
ఈ ఏడాది జనవరి 17న రష్యా చేరుకున్న నావల్నీని విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2014లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని పేర్కొంటూ అరెస్టు చేశారు. ఈ ఆరోపణలన్నీ అధికార పార్టీ కల్పితాలని నావల్నీ ఖండిస్తున్నారు.
ఇదీ చదవండి: అంగారకుడి ఉపరితలం చిత్రాలను పంపిన రోవర్