చైనాపై కరోనా పంజా తారస్థాయిలో ఉన్నప్పుడు.. బాధితులకు చికిత్స అందించిన వైద్య సిబ్బంది నిద్రలేమి సమస్యతో(ఇన్సోమ్నియా) తీవ్రంగా సతమతమయ్యారని ఓ నివేదిక వెల్లడించింది. మూడింట ఒక వంతు కన్నా ఎక్కువ మంది ఆరోగ్య సిబ్బంది ఇన్సోమ్నియా బారినపడ్డారని తెలిపింది. దీనిని బట్టి వైరస్‌తో భౌతికంగానే కాకుండా, మానసికంగానూ సమస్యలు ఎదురవుతాయని అర్థమవుతోందని విశ్లేషించింది.
ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తించిన ఆరోగ్య సిబ్బందికి నిద్రలేకపోతే వారు తీవ్ర ఒత్తిడి, బాధకు గురవుతారని జర్నల్ ఫ్రంటియర్స్ ఇన్ సైకియాట్రీ వెల్లడించింది. రోగులకు దగ్గరగా ఉండటం వల్ల తమకు వైరస్ సోకుతుందని.. తమ వల్ల తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకూ కరోనా వ్యాపిస్తుందని ఆరోగ్య సిబ్బంది తీవ్ర ఆందోళన చెందినట్టు పరిశీలనలో గమనించింది.
"ఒత్తిడి వల్ల కలిగే నిద్రలేమి ఎక్కువ రోజులు ఉండదు. కానీ వైరస్ విజృంభణ కొనసాగితే ఇది దీర్ఘకాలికంగా మారే అవకాశముంది."
--- బిన్ జంగ్, దక్షిణ చైనా వైద్య విశ్వవిద్యాలయం ఆచార్యులు
సామాజిక మాధ్యమం ద్వారా జనవరి 29 నుంచి ఫిబ్రవరి 3 మధ్య 1,563మందిపై ఈ సర్వే నిర్వహించారు. ఇందులో 564మంది(36.1శాతం) ఇన్సోమ్నియా లక్షణాలతో సతమతమయినట్లు తేలింది.
2002 నాటి సార్స్ పరిస్థితుల్లో 37శాతం మంది నర్సులు నిద్రలేమితో బాధపడ్డారు. తాజాగా నిద్రలేమితో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న వారి శాతం 87.1గా ఉంది. అదే ఇన్సోమ్నియా లేకుండా ఒత్తిడికి గురవుతున్న వారు 31శాతం.
వైద్య పట్టా పుచ్చుకున్నవారితో పోల్చితే.. ప్రాథమిక ఉన్నత విద్య పూర్తి చేసిన వారు 2.69 రెట్లు ఎక్కువగా నిద్రలేమితో బాధపడుతున్నారని సర్వే తెలిపింది. వారిలో నెలకొన్న భయాందోళనలే ఇందుకు కారణమని విశ్లేషించింది.
ఇదీ చూడండి:- అందం, ఆరోగ్యం మీ చేతుల్లోనే... ఇలా చేస్తే సరి!