వాస్తవాధీన రేఖ వద్ద శాంతిని కొనసాగించడానికి భారత్-చైనా ప్రభుత్వాధినేతల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని పాటించకుండా ఉండరాదని చైనాకు భారత్ స్పష్టం చేసింది. చైనా విదేశీ వ్యవహారాల ప్రజా సంస్ధ, ప్రపంచ వ్యవహారాల భారత మండలి నిర్వహించిన సదస్సును ఉద్దేశించి చైనాలో భారత రాయబారి విక్రం మిశ్రీ ప్రసంగించారు. ఈ సందర్భంగా చైనాకు పలు సూచనలు చేశారు.
ఇటీవల తలెత్తిన ఉద్రిక్తతల వల్ల రెండు దేశాల మధ్య దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ జరగాలంటే తూర్పు లద్దాఖ్‌లో చైనా తమ బలగాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని విక్రం మిశ్రీ సూచించారు. శాంతి స్ధాపనకు ఉన్న ప్రాధాన్యంపై నేతల మధ్య కుదిరిన కీలక ఏకాభిప్రాయాన్ని.. చైనా అధికారులు విస్మరించడాన్ని ప్రశ్నించారు. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు, చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ నిర్మాణం తీరును కూడా విక్రం మిశ్రీ తప్పుపట్టారు. ఇతర దేశాలతో ఒప్పందాలు, సంప్రదింపులు లేకుండా ఏ దేశం కూడా అజెండాను నిర్ణయించలేదని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: భారత్‌తోనే చైనా కట్టడి దిశగా అమెరికా!
ఇదీ చూడండి: 'స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్.. భారత్ లక్ష్యం'