ఆహార సంక్షోభం, ద్రవ్యోల్బణంతో అష్టకష్టాలు పడుతున్న శ్రీలంక వాసులకు మరో భారీ షాక్ తగిలేలా ఉంది. లీటరు పెట్రోల్ ధర రూ.20, డీజిల్ ధర రూ.30 మేర ఒకేసారి పెంచేందుకు చమురు మార్కెటింగ్ సంస్థలు సిద్ధమవుతున్నాయి. పెట్రో ధరలను ఈమేరకు సవరించేందుకు అనుమతించాల్సిందిగా శ్రీలంక ప్రభుత్వాన్ని కోరింది లంక ఐఓసీ. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా శ్రీలంకలోనూ ధరల పెంపు అనివార్యమని తెలిపింది.
లంక ఐఓసీ.. భారత్‌కు చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు అనుబంధ సంస్థ. 2002 నుంచి శ్రీలంకలో కార్యకలాపాలు సాగిస్తోంది. 200కుపైగా పెట్రోల్ స్టేషన్లు నిర్వహిస్తూ.. ఆ దేశ చమురు అవసరాల్లో 12శాతం తీర్చుతోంది. అటు.. అంతర్జాతీయంగా చమురు ధరలు 65 అమెరికా డాలర్ల నుంచి 84 డాలర్ల వరకు పెరిగిపోయింది. ఈ క్రమంలో ఇంతకాలం.. చమురు ధరలు పెంచడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం వల్ల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇంధనంపై శ్రీలంక ఈ ఏడాది ఇప్పటికే అధికంగా వెచ్చించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏడు నెల్లలోనే 41.5 శాతం అధికంగా ఖర్చు చేసింది. కరోనా మహమ్మారి కారణంగా పర్యటకం దెబ్బతిని విదేశీ మారక నిల్వలు భారీగా పడిపోయాయి. దీంతో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని లంక ఎదుర్కొంటోంది. దీంతో చమురు ధరలు పెంచడానికి అక్కడి ప్రభుత్వం నిరాకరిస్తోంది.
ధరల మోత..
గత ఏడాది కాలంగా శ్రీలంకను ఆహార, ఆర్థిక సంక్షోభం కుదిపేస్తోంది(sri lanka food inflation). ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ఆ దేశ విదేశీ మారక ద్రవ్యం భారీగా పతనమైంది. మరోవైపు కరోనా మహమ్మారి దెబ్బకు ఎగుమతులు దెబ్బతిన్నాయి(sri lanka food crisis reason). ప్రత్యేకించి పర్యటక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ఉన్న కాస్త విదేశీ మారక నిల్వలను ఆదా చేసుకునే క్రమంలో దిగుమతులపై నిషేధం విధించింది. అయితే నిత్యావసర వస్తువులైన పప్పులు, పంచదార, గోధుమపిండి, కూరగాయాలు వంటి వస్తువులకు కూడా శ్రీలంక దిగుమతులపైనే ఆధారపడాలి. ప్రభుత్వ నిషేధంతో ఆ వస్తువుల డిమాండ్, సరఫరా మధ్య తీవ్ర అంతరం ఏర్పడింది. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. దీంతో ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లంక ప్రభుత్వం ధరలపై నియంత్రణ విధిస్తూ అత్యవసర నిబంధనలు తీసుకొచ్చింది.దీంతో ఒక్కసారిగా నిత్యావసర ధరల మోత మోగింది. గత వారంలో రూ.1400 ఉన్న 12.5కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర.. ఒక్కసారిగా రూ.2,657కు చేరింది. అంటే రెండు రోజుల వ్యవధిలోనే సిలిండర్ ధర రూ.1257 పెరిగింది. ఇక కేజీ పాల ధర రూ.250 నుంచి రూ.1195కు చేరింది. ఇవే కాదు.. గోధుమ పిండి, పంచదార, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువులు, సిమెంట్ సహా దాదాపు అన్నింటి ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.గ్యాస్‌తో పాటే పెట్రో ధరలు కూడా పెరగాల్సి ఉంది. అయితే.. ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని చమురు మార్కెటింగ్ సంస్థలను శ్రీలంక ప్రభుత్వం కోరింది.
ఇదీ చదవండి:భారత్- శ్రీలంక చారిత్రక మైత్రి కొనసాగేనా..?