ఈస్టర్ సండే వరుస బాంబు పేలుళ్ల మారణహోమంతో అస్తవ్యస్తమైన శ్రీలంక ప్రస్తుతం మత ఘర్షణలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మతపరమైన అల్లర్లు పెరగడం వల్ల దేశంలోని పలు ప్రాంతాల్లో సోమవారం 6 గంటల పాటు కర్ఫ్యూ విధించింది శ్రీలంక ప్రభుత్వం. నిబంధనలను ఉల్లఘించినవారిపై 'కనిపిస్తే కాల్చివేత' ఆదేశాలు జారీ చేసింది.
"సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 4 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. అవాంఛనీయ ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని భద్రతా దళాలకు సూచించాం. షూట్ ఎట్ సైట్ ఆదేశాలతో వారు సిద్ధంగా ఉన్నారు."
-- మహేష్ సేననాయకే, సైన్యాధిపతి.
శ్రీలంకలోని వాయవ్య ప్రాంతాలైన కులియపిటియా, బింగీరియా, దుమ్మలసూరియా, హిట్టపొ నగరాల్లో కర్ఫ్యూ విధించారు అధికారులు. సోమవారం జరిగిన మత ఘర్షణల్లో ఒకరు మృతిచెందారు.
హింసాత్మక ఘటనల దృష్ట్యా సోమవారం దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలను నిషేధించింది శ్రీలంక ప్రభుత్వం.
శాంతియుతంగా ఉండాలని, అసత్య ప్రచారాలను నమ్మొద్దని ప్రజలను అభ్యర్థించారు ప్రధాని విక్రమసింఘే.
ఇదీ చూడండి: చిన్నారి వైద్యానికి.. ప్రియాంక ప్రత్యేక విమానం