'గేమ్ ఆఫ్ థ్రోన్స్' అనగానే మనకు చాలా యాక్షన్ సన్నివేశాలు గుర్తొస్తాయి. వాటిలో 'రీగల్, వైసీరియన్' డ్రాగన్ పోరాట దృశ్యాలు ప్రత్యేకం. అవి కల్పితాలే అయినా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందాయి. లండన్ జూలోనూ ఓ నిజమైన డ్రాగన్ ఉంది. అయితే ఈ కొమోడో డ్రాగన్ నిప్పులు కక్కలేదు, ఎగరలేదు.
అందుకే ఆ పేరు...
బల్లి జాతిలో ఇంకా మనుగడ సాగిస్తున్న అతిపెద్ద జీవి కొమోడో. ఇండోనేసియాలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడి దీవి పేరు మీదుగా కొమోడో డ్రాగన్(ఉడుము)గా పిలుస్తున్నారు. వీటిలో అతి పెద్దవి సుమారు 3 మీటర్ల వరకు పెరుగుతాయి. నాలుకతోనే వాసనను గుర్తిస్తాయి. 9 కిలోమీటర్లు దూరంలో ఉన్నా ఆహారాన్ని పసిగట్టే శక్తి వీటి సొంతం.
11ఏళ్ల వయసున్న గణాస్ కూడా ఇండోనేసియా నుంచే లండన్‌కు వచ్చింది. 2015 నుంచి 'అటెన్‌బరో కొమోడో డ్రాగన్ హౌస్'లో నివసిస్తోంది ఈ ఉడుము.
"భూమధ్య రేఖకు దగ్గరి దీవులే వీటి అసలైన నివాస స్థానాలు. అక్కడ వేడి ఎక్కువ, గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. మాకు సాధ్యమైనంతలో అలాంటి వాతావరణాన్ని సృష్టించి రక్షించగలుగుతున్నాం. "
-డేనియల్ కేన్, గణాస్ సంరక్షకుడు
తగ్గుతున్న సంఖ్య
కమోడోల మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. నానాటికీ వీటి సంఖ్య తగ్గుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 5 వేలు మాత్రమే. అందుకు కారణం అడవుల దురాక్రమణే. అడవులతో అక్రమ వ్యాపారమూ ఈ జాతి హననానికి మరో కారణమంటున్నారు లండన్ జూ పర్యవేక్షకుడు జో కేపన్.
"9 కోట్ల సంవత్సరాల్లో జీవి మనుగడను చూస్తే.. కొమోడోలే చాలా కాలం స్థిరంగా జీవించాయి. 16వ శతాబ్దంలో ఇండోనేసియాకు డచ్, పోర్చుగీసు వారు వలసలకు వెళ్లినప్పుడు వీటిని గుర్తించారు. అప్పటివరకూ చరిత్ర పాఠాల్లో మాత్రమే ఉండేవి. ఇప్పుడు అదే జరగతుందేమో?"
- జో కేపన్, జూ పర్యవేక్షకుడు
అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సమాఖ్య(ఐయూసీఎన్) కమోడోల సంఖ్య తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేసింది.