Kim Jong Un decade in power: కిమ్ జోంగ్ ఉన్ పాలనలో ఉత్తర కొరియా పదేళ్లు పూర్తి చేసుకుంది. ఆహార సంక్షోభాలు, విదేశాలతో సంఘర్షణలు, పౌరుల నిర్దాక్షిణ్య హత్యలతో ఈ దశాబ్దాన్ని ఎప్పటిలాగే బిక్కుబిక్కుమంటూ వెళ్లదీసింది.
Kim North Korea rule
2011 డిసెంబర్ 17న తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ మరణం తర్వాత ఉత్తర కొరియా అధినేతగా పగ్గాలు చేపట్టారు కిమ్ జోంగ్ ఉన్. అప్పటికే అంతర్జాతీయంగా ఒంటరిగా ఉన్న ఈ దేశం.. కిమ్ పాలనలో మరింత ఏకాకిగా మారిపోయింది. కరోనా వైరస్ కారణంగా ఉత్తర సరిహద్దులను చైనా మూసివేసింది. దీంతో దేశం నుంచి పారిపోవాలనుకునే పౌరులకు చివరి మార్గం మూతపడినట్లైంది.
Food crisis North korea
కిమ్ పాలనలో ఉత్తర కొరియా ఆహార సంక్షోభ కోరల్లో చిక్కుకుంది. దేశంలోని ప్రస్తుత తరం మొత్తం పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని ఐక్య రాజ్యసమితి నివేదికలో తేలింది. ఆకలితో పాటు పోషకాహార లోపంతో సంభవిస్తున్న మరణాలకు లెక్కే లేదు. డయేరియా, న్యుమోనియా వంటి వ్యాధులూ తీవ్రంగా ఉన్నాయి.
మూడు తరాల కష్టాలు
గత డెబ్బై ఏళ్లుగా ఆకలికేకలతో అల్లాడుతోంది ఉత్తర కొరియా. కిమ్ తండ్రి, తాత కిమ్ ఇల్ సంగ్ల కాలం నుంచీ అనేక కష్టాలు ఎదుర్కొంటోంది. కిమ్ పదవిలో ఉన్న ఈ పదేళ్ల కాలంలో వారికి కొత్తగా ఒరిగిందేమీ లేదు. అణచివేత ధోరణి, విఫల విధానాలు, పౌరుల్లో భయాందోళనలు అలాగే కొనసాగాయి.
Kim Jong Un killings
ప్రస్తుత నియంత.. పౌరుల హత్యల్లో తన తాత, తండ్రితో పోలిస్తే వెనకబడే ఉన్నారు. వ్యక్తిగతంగా ఆదేశాలు జారీ చేసి హత్య చేసిన వారి సంఖ్య వందల్లోనే ఉంది. 2013లో తన బాబాయ్‌ను, 2017లో సవతి సోదరుడి హత్యకు కిమ్ ఆదేశాలు ఇచ్చారు. అయితే, కిమ్ ఇల్ సంగ్, కిమ్ జోంగ్ ఇల్లు చేసిన హత్యలు ఇంతకంటే ఎక్కువేనని తెలుస్తోంది. కిమ్ వయసు 37 సంవత్సరాలే కాబట్టి.. ఈ విషయంలో తన పూర్వీకులను అధిగమించే అవకాశాలు మెండుగా ఉన్నాయని కొరియన్ హిస్టరీ స్కాలర్లు అభిప్రాయపడుతున్నారు.
మూడు తరాలుగా...
ఉత్తర కొరియా ఆవిర్భవించిన రెండేళ్లకు అంటే.. 1950లో కిమ్ తాత కొరియా యుద్ధాన్ని ప్రారంభించారు. ఈ యుద్ధంలో 40 లక్షల మంది చనిపోయారు. ఇందులో ఎక్కువ మంది ఉత్తర కొరియాకు చెందినవారే. దక్షిణ కొరియాకు అండగా వచ్చిన ఐరాస దళాల చేతిలో వీరు మరణించారు.
- దక్షిణ కొరియాను ఆక్రమించుకోవాలన్న కిమ్ తాత వాంఛ 1953లో యుద్ధంలో ఓడిపోవడం వల్ల అడియాశ అయింది. ఆ తర్వాత కిమ్ ఇల్ సంగ్.. చైనా, రష్యా అనుకూల వైఖరిని అవలంబించడం ప్రారంభించారు. తనను వ్యతిరేకించిన పార్టీ అధికారులను బహిష్కరించారు. వేల మందిని హత్య చేయించారు.
- 1994 జులైలో కిమ్ జోంగ్ ఇల్.. సంగ్ వారసుడిగా కొరియా అధ్యక్షుడయ్యారు. ఈ సమయంలో వినాశకరమైన కరవు బారిన పడి కొరియాలో 20 లక్షల మంది చనిపోయారు. వీరిని కాపాడేందుకు చర్యలు తీసుకునే బదులు.. సైన్యాన్ని పెంచి పోషించేందుకే నిధులు వెచ్చించారు కిమ్ జోంగ్ ఇల్.
- కరవు తీవ్రంగా ఉన్న 1997 ఏడాదిలో కొరియా సైనిక బడ్జెట్ అక్షరాలా రూ.46 వేల కోట్లుగా అమెరికా లెక్కగట్టింది. కోట్ల రూపాయలను క్షిపణుల అభివృద్ధికి కేటాయించారు.
- రూ. 6వేల కోట్లు వెచ్చించి తన తండ్రికి సమాధి కట్టించారు. ఏటా కనీసం రూ.1500 కోట్లు ఆహార ధాన్యాల ఉత్పత్తి కోసం ఖర్చు చేసి ఉంటే.. ఆకలితో ఎవరూ చనిపోయేవారు కాదని ఐరాస అంచనా. అన్నీ తెలిసి ఉద్దేశపూర్వకంగా ఈ అమానవీయ చర్యకు పాల్పడ్డారని ఐరాస పేర్కొంది.
కిమ్ దశాబ్దం అంతే..
కిమ్ జోంగ్ ఉన్ దశాబ్ద కాలంలోనూ దేశంలో ఇదే పరిస్థితి కొనసాగింది. 2010 తర్వాత కరవు వంటి పరిస్థితులు తలెత్తాయి. చైనా తన సరిహద్దులు మూసివేయక ముందు కూడా.. ఆహార సంక్షోభం తలెత్తింది. ఈ సమస్యకు పరిష్కారాలేవీ లేక.. 2025 ఏడాది వరకు ప్రజలు తక్కువ తినాలని కిమ్ అభ్యర్థించాల్సిన గత్యంతరం ఏర్పడింది.
- పదేళ్ల కాలంలో కిమ్.. జీడీపీలో 25 శాతం నిధులను సైన్యంపై వెచ్చించారు.
- కిమ్ హయాంలో దేశం నుంచి పారిపోవడం పౌరులకు మరింత కష్టతరమైంది. కిమ్ పాలన తొలి ఏడాదిలో దక్షిణ కొరియాకు పారిపోయిన వారి సంఖ్య 1500. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే సగమే.
- రెండేళ్ల కరోనా లాక్డౌన్ సమయంలో ఈ సంఖ్య 100 లోపే ఉంటుందని అంచనా.
కయ్యానికి కాలు దువ్వి...
పదేళ్ల కిమ్ పాలనలో 130కి పైగా క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించింది. 2017లో ఖండాతర బాలిస్టిక్ క్షిపణులనూ తన అమ్ములపొదిలోకి చేర్చుకుంది. అదే ఏడాది నాలుగు అణు పరీక్షలు నిర్వహించింది. అందులో ఒక థర్మోన్యూక్లియర్ బాంబు సైతం ఉంది. అమెరికాను దృష్టిలో పెట్టుకొని వీటిని తయారుచేసుకొంది. కిమ్ పాలనలో అమెరికాతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ట్రంప్ అగ్రరాజ్య అధ్యక్షుడిగా ఉన్న సమయంలో శాంతి చర్చలు ప్రారంభించినప్పటికీ.. ఫలితం లేకపోయింది.
ఇదీ చదవండి:
- కిమ్ రాజ్యంలో ఆకలి కేకలు- సైన్యం సరకులు కూడా...
- అణ్వాయుధాలు, క్షిపణులు మాయం- రూటు మార్చిన కిమ్!
- ఉత్తర కొరియా దూకుడు- రైలు నుంచి క్షిపణి ప్రయోగం
- దక్షిణ కొరియాతో కిమ్ స్నేహగీతం.. అమెరికాపై విమర్శల దాడి!
- వెనక్కి తగ్గని 'కిమ్'.. మరో క్షిపణి ప్రయోగం
- అక్కడ నవ్వులు, ఏడుపులు బంద్- ఉల్లంఘిస్తే అంతే సంగతులు!
- నన్ను క్షమించండి అంటూ 'కిమ్' కన్నీరు.!