కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. పాకిస్థాన్ దుశ్చర్యకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి గ్రామాలపై కాల్పులకు తెగబడింది. జమ్ముకశ్మీర్‌లోని పుంఛ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. చిన్న చిన్న ఆయుధాలు, మోర్టార్ షెల్స్‌తో దాడులకు పాల్పడినట్లు రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు.
నియంత్రణ రేఖ వెంబడి బాలాకోట్ సెక్టార్లో సాయంత్రం 6 గంటలకు ఈ దాడులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఈ దాడికి భారత సైన్యం దీటుగా బదులిచ్చిందని పేర్కొన్నారు. మన సైనికుల్లో ఇప్పటివరకు ఎవరికీ ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.
భద్రతా బలగాలే లక్ష్యంగా..
బారాముల్లా జిల్లా సోపోర్ వద్ద భద్రతా బలగాలపై దాడులకు యత్నించారు ముష్కరులు. ఈ ఘటనలో ఇద్దరు పౌరులకు గాయాలయ్యాయి.
సోపోర్ బస్‌స్టాప్ వద్ద ఉన్న సైనికులపై గ్రనేడ్ దాడులకు ఉగ్రవాదులు యత్నించారు. అయితే.. అవి బలగాలపై కాకుండా రోడ్డుపక్కన పడ్డాయి. ఈ పేలుడులో ఇద్దరు పౌరులకు స్వల్పంగా గాయాలయ్యాయి. వారిని అధికారులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: 'సైన్యం దాడిలో 90 మంది తాలిబన్లు బలి'