కరోనా మహమ్మారి కారణంగా మాస్కులు ధరించడం తప్పనిసరి. మొదట్లో వీటి పట్ల అంతగా ఆసక్తి చూపని వారు, ప్రస్తుతం దీనిని ఒక ట్రెండ్‌గా భావిస్తున్నారు. వ్యాపార సంస్థలు కూడా వినియోగదారులను ఆకట్టుకునే రీతిలో విభిన్న ఆకృతుల్లో, వివిధ రంగుల్లో మాస్కులను రూపొందిస్తున్నాయి. వీటిలో ఎన్-95 మాస్కుల నుంచి సులభంగా గుడ్డతో తయారుచేసుకోగలిగే మాస్కులు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల పుణెకి చెందిన ఒక వ్యక్తి బంగారంతో మాస్కు తయారు చేయించుకుంటే..అంతకు ముందే ఒడిశాకు చెందిన ఒకరు వెండితో మాస్కు చేయించుకున్నారు.
తాజాగా అమెరికాకు చెందిన ఓ చైనీస్ వ్యాపారవేత్త కూడా వినూత్నంగా మాస్క్ తయారు చేయించుకోవాలనుకున్నాడు. ఇందుకోసం ఇజ్రాయెల్‌లోని జెరూసలేంకు చెందిన యెవెల్ అనే జ్యూయలరీ సంస్థను సంప్రదించాడు. వాళ్లు ఆయనకు నచ్చిన విధంగా ఒక మాస్క్ తయారు చేసేందుకు అంగీకరించారు. ఇంతకీ దాని ధరెంతో తెలుసా? అక్షరాలా 1.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 11కోట్లు). వజ్రాలతో రూపొందించిన ఈ మాస్క్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మాస్క్ అని యెవెల్ సంస్థ తెలిపింది. దీని తయారీ కోసం 18 క్యారెట్ల తెల్ల బంగారాన్ని, 3,600 తెలుపు, నలుపు వజ్రాలను ఉపయోగించారు. అంతేకాదు, ఇందులో ఎన్-99 ఫిల్టర్‌ని కూడా అమర్చారు. అయితే కొనుగోలు చేసే వ్యక్తి వివరాలను వెల్లడించేందుకు మాత్రం సదరు సంస్థ నిరాకరించింది. ఈ ఏడాది చివరి నాటికి డైమండ్ మాస్క్ తయారీ పూర్తవుతుందని యెవెల్ సంస్థ తెలిపింది. అసలే కరోనా కష్ట కాలం.. మరి ఈ మాస్క్ ధరించి సదరు వ్యక్తి బయట ఎలా తిరుగుతాడో చూడాలి.
ఇదీ చూడండి: 'ఉపరాష్ట్రపతి పదవికే ఆయన వన్నెతెచ్చారు'