గూఢచర్యం కేసులో పాక్ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కేసులో మరో ముందడుగు పడింది. మరణశిక్ష పునఃసమీక్ష అంశంలో ఆయన తరఫు వాదనలు వినిపించేందుకు లాయర్‌ను నియమించుకునే అవకాశాన్ని భారత్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు కల్పించింది. అయితే, అతడు పాకిస్థానీ న్యాయవాదే అయి ఉండాలని షరతు విధించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 3కు వాయిదా వేసింది.
భారత్‌కే అవకాశం..
అంతర్జాతీయ కోర్టు(ఐసీజే) ఆదేశాల మేరకు మిలటరీ కోర్టు ఇచ్చిన తీర్పును సివిల్ కోర్టులో సమీక్షించే అవకాశాన్ని తీసుకొస్తూ ఇటీవల పాక్ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ క్రమంలో జాదవ్ తరఫు వాదనలు వినిపించేందుకు లాయర్‌ను నియమించాలని జులై 22న ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ సందర్భంగా న్యాయవాదిని నియమించుకునే అవకాశాన్ని భారత్‌కు కల్పించినట్లు పాక్ అటార్నీ జనరల్ ఖలీద్ జావేద్ ఖాన్ తెలిపారు. అయితే, అతడు భారతీయుడు అయ్యి ఉండకూడదని, పాకిస్థాన్‌లో లా ప్రాక్టీస్ చేసిన వ్యక్తినే నియమించుకోవచ్చని చెప్పారు.
సరైన సాక్ష్యాధారాలు లేనందున..
గూఢచర్యం ఆరోపణలపై 2017 ఏప్రిల్‌లో పాక్ మిలటరీ కోర్టు కుల్‌భూషణ్‌కు మరణశిక్ష విధించింది. ఫలితంగా భారత్.. ఐసీజేను ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 2017 మే 18న జాదవ్ మరణశిక్షపై స్టే విధించింది. అనంతరం ఇరు దేశాల వాదనలు విన్న న్యాయస్థానం.. కేసును పునః సమీక్షించి, సరైన సాక్ష్యాధారాలు సమర్పించే వరకు ఉరిశిక్షను నిలుపుదల చేస్తున్నట్లు 2019 జులై 17న తీర్పు వెలువరించింది.
ఆ తీర్పును అనుసరించి సివిల్ కోర్టులో పునఃసమీక్షకు అనుగుణంగా ఇటీవల పాక్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనిపై అధికార పార్టీపై విపక్షాలు భగ్గుమున్నాయి. జాదవ్‌కు ఊరట కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించగా.. ఐసీజే తీర్పును అనుసరించే తీసుకొచ్చామని ప్రభుత్వం పేర్కొంది.
ఇదీ చదవండి: పాక్‌లో కరోనా తగ్గుముఖం- లాక్డౌన్ ఎత్తివేత