ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో మరోసారి రాకెట్ల మోత మోగింది. అమెరికా బలగాలే లక్ష్యంగా శనివారం రెండు రాకెట్ దాడులు జరిగాయి. ఈ ఘటనతో పాటు గ్రీన్ జోన్ పరిధిలో మోర్టార్ దాడులు కూడా జరగడం తీవ్ర కలకలం రేపింది. ఇరాన్ అనుకూల వర్గమైన కటేబ్ హిజ్బుల్లా ఈ దాడులకు పాల్పడినట్టు సమాచారం. అమెరికా బలగాలు ఉన్న స్థావరాలకు కనీసం వెయ్యి మీటర్ల దూరం ఉండాలని ఇరాక్ సైన్యాన్నికటేబ్ హిజ్బుల్లా కోరిన కొద్ది గంటల వ్యవధిలోనే ఈ దాడి జరగడం గమనార్హం. అయితే ఈ ఘటనలో ఎవరు మృతి చెందలేనది ఇరాక్ భద్రతాధికారులు స్పష్టం చేశారు.
అగ్రరాజ్య రాయబార కార్యాలయం ఉండే గ్రీన్ జోన్ పరిధిలో శనివారం సాయంత్రం రెండు మోర్టార్ దాడులు జరిగాయి. అనంతరం ఉత్తర బాగ్దాద్‌లో అమెరికా బలగాలు మోహరించి ఉన్న బాలాద్ వైమానిక స్థావరంపై రెండు కాట్యుషా రాకెట్లతో విరుచుకుపడ్డారు.
అప్రమత్తమైన అధికారులు డ్రోన్ల సహాయంతో పరిసర ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేశారు. దాడికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
యుద్ధ మేఘాలు...
శుక్రవారం బగ్దాద్ విమానాశ్రయంపై అమెరికా దళాలు రాకెట్లతో దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ టాప్ కమాండర్ ఖాసిం సులేమానీ మృతి చెందారు. వేకువజామున జరిగిన ఈ ఘటనలో సులేమానీ, ఇరాక్‌కు చెందిన ఉన్నత స్థాయి కమాండర్లు సహా ఎనిమిది మంది మరణించారు.
ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించగా.. పశ్చిమాసియాలో భారీ బలగాలను మోహరించింది అమెరికా. ఈ నేపథ్యంలో అక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.