ఇరాన్‌పై ఆంక్షలను మరింత కఠినతరం చేసింది అమెరికా. ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపే ఆంక్షలను ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అమలు చేసిన ట్రంప్ సర్కార్.... తాజాగా ఇరాన్ సైన్య అనుబంధ సంస్థ 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ (ఐఆర్జీసీ)'ను విదేశీ తీవ్రవాద సంస్థగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది.
అమెరికా నిర్ణయంపై ఘాటుగా స్పందించింది ఇరాన్. ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది అమెరికానే అని విమర్శించారు ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహాని. 1979లో 'రివల్యూషనరీ గార్డ్స్' ఏర్పడినప్పటినుంచి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతోందని రౌహాని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది ఎవరు? ఐఎస్ఐఎస్ను ఒక ఆయుధంగా వినియోగించుకోవాలనుకుంటోంది ఎవరు? అని అమెరికాను ప్రశ్నించారు హసన్.
"సైన్యంతో అనుబంధమున్న సంస్థలపై ఉగ్రవాద ముద్ర వేసేందుకు మీరెవరు? ప్రపంచ దేశాలపై ఉగ్రవాదాన్ని ఒక ఆయుధంగా వినియోగిస్తూ... తీవ్రవాదులకు మీరే నాయకత్వం వహిస్తున్నారు."
- హసన్ రౌహాని, ఇరాన్ అధ్యక్షుడు
'ఐఆర్జీసీ'ని విదేశీ తీవ్రవాద సంస్థగా గుర్తించిన అమెరికా
ఇరాన్ సైన్యానికి అనుబంధ సంస్థ 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్'ను 'విదేశీ తీవ్రవాద సంస్థ'గా పరిగణిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించే దిశగా ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో పేర్కొన్నారు.
" ఇరాన్‌పై ఒత్తిడి పెంచే చర్యలను అమెరికా కొనసాగిస్తోంది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నాం. ఈ సంస్థకు సహకారం అందించినందుకు ఐఆర్జీసీని కూడా ఎఫ్టీఓ గా పరిగణిస్తున్నాం. లెబనీస్ హెచ్‌బొల్లా, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్, ఖాతిబ్ హెజ్బొల్లాలనూ ఈ జాబితాలో చేర్చుతున్నాం."
-మైక్ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి
ఫిబ్రవరిలో రెండో విడత కఠిన ఆంక్షలు
ఇరాన్‌పై అమెరికా రెండో విడత కఠిన ఆంక్షలను ఫిబ్రవరిలోనే అమల్లోకి తీసుకొచ్చింది. ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగినందుకు ఈ నిర్ణయం తీసుకొంది. ఈ ఆంక్షలు ఇరాన్ చమురు వ్యాపారం, షిప్పింగ్, బ్యాంకింగ్ రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.