ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న పాకిస్థాన్‌కు అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2011లో బలూచిస్థాన్‌లోని రెకో డిక్ ప్రాజెక్టు కోసం టెథియాన్ కాపర్ కంపెనీ (టీసీసీ)కి మైనింగ్ లీజును చట్టవిరుద్ధంగా తిరస్కరించినందుకు ఏకంగా 597 కోట్ల డాలర్ల భారీ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
టీసీసీ మైనింగ్ లీజు అభ్యర్థనను బలూచిస్థాన్ ప్రభుత్వం తిరస్కరించినందుకు 2011 నవంబర్‌లో రెకో డిక్ ప్రాజెక్టు పనులు అర్థంతరంగా ఆగిపోయాయి. తద్వారా తమకు 114.3 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లిందని టీసీసీ తెలిపింది. పాక్ ప్రభుత్వానికి, తమకు మధ్యనున్న ఈ వివాదంలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వం కోసం.. 2012 జనవరి 12న 'ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెట్ డిస్ప్యూట్స్'(ఐసీఎస్‌ఐడీ) ముందు పిటిషన్ దాఖలు చేసింది.
అనంతరం అదే ఏడాది జులై 12న ఈ వివాదంపై ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది ఐసీఎస్‌ఐడీ. తాజాగా ఈ అంశంపై తీర్పు వెలువరించింది అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం. దాదాపు ఏడేళ్లపాటు సాగిన ఈ వివాదంలో పాక్ ప్రభుత్వంపై టీసీసీనే నెగ్గింది.
ఇదీ చూడండి : చంద్రయాన్-2 ప్రయోగం మళ్లీ ఎప్పుడు?