చర్చల మీద చర్చలు జరుగుతున్నా.. భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితులు మారడం లేదు. ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏడో రౌండ్ కోర్ కమాండర్ స్థాయి చర్చల తేదీలపై ఇంకా స్పష్టత రావడం లేదు. ప్రస్తుతం విదేశీ వ్యవహారాల ప్రతినిధుల స్థాయిలో గత రెండు రోజులుగా రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇందులో పెద్దగా పురోగతి కనిపించలేదు.
సెప్టెంబర్ 10న మాస్కోలో జరిగిన ఇరు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో ఐదు పాయింట్ల ఆధారంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 21న జరిగిన ఆరో రౌండ్ కోర్ కమాండర్ స్థాయి సమావేశంలో కూడా ఆ ఐదు పాయింట్లే చర్చకు వచ్చాయి. ఆ చర్చల ఆధారంగా సరిహద్దులకు మరిన్ని దళాలు పంపకూడదని.. యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే ప్రయత్నాలు చేయకూడదని కమాండర్లు నిర్ణయించారు. ఆచరణలో మాత్రం అవి అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా విదేశాంగ ప్రతినిధుల స్థాయిలో చర్చలు జరుగుతున్నా.. ఏడో రౌండ్ కోర్ కమాండర్ల సమావేశ తేదీపై మాత్రం స్పష్టత రాలేదు.
అయితే.. ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రొటోకాల్‌ను అనుసరించి వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణపై ఇరు దేశాలు కృషి చేస్తాయని భారత విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింది.
కొద్ది నెలలుగా భారత్-చైనా మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ప్రతిష్టంభనను ముగించే దిశగా ఇరు దేశాల మధ్య దౌత్య, సైనిక స్థాయి చర్చలు జరుగుతున్నా.. సరైన పరిష్కారం లభించట్లేదు.