రక్షణ రంగంలో భారత్, ఇజ్రాయెల్ కలిసి అరుదైన ఘనత సాధించాయి. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల సామర్థ్యం ఉన్న(ఎంఆర్ఎస్ఎమ్) క్షిపణిని ఇరు దేశాలు విజయవంతంగా పరీక్షించాయి. గత వారంలో ఈ పరీక్షను నిర్వహించినట్లు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్(ఐఏఐ) మంగళవారం తెలిపింది. పరీక్షలో భాగంగా.. ఈ ఎంఆర్ఎస్ఎమ్ క్షిపణిని భూమి నుంచి మొబైల్ లాంచర్తో ప్రయోగించగా.. విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించిందని వెల్లడించింది. ఇజ్రాయెల్ రక్షణ పరిశ్రమ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రయోగ పరీక్షలో ఇజ్రాయెల్, భారత్కు చెందిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
"ఐఏఐ, భారత్ మధ్య బలమైన భాగస్వామ్యానికి ఈ ప్రయోగం నిదర్శనం. భారత రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్డీఓ), భారత భద్రతా దళాల సహకారంతో కలిసి నిర్వహించిన ఈ పరీక్షకు నేతృత్వం వహించినందుకు ఐఏఐ గర్వంగా భావిస్తోంది."
-- బావోజ్ లెవీ, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు, సీఈఓ.
ఈ అధునాతన ఎంఆర్ఎస్ఎమ్ యుద్ధ క్షిపణి గగనతలంలో శత్రువుల నుంచి రక్షణ అందించగలదు. 50-70 కి.మీ దూరం నుంచి శత్రు విమానాలపై దాడి చేయగలదు.
ఐఏఐ, భారత రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్డీఓ) సంయుక్తంగా ఈ క్షిపణిని అభివృద్ధి చేశాయి. భారత్లోని త్రివిధ దళాలతో పాటు, ఇజ్రాయెల్ భద్రతా బలగాలు దీనిని వినియోగించనున్నాయి.
ఇదీ చూడండి:పొరపాటున దేశం దాటి.. 11 ఏళ్లకు ఇల్లు చేరి...