అమెరికా, ఇరాన్‌లతో భారత్‌కు చిరకాల అనుబంధం ఉంది. దానితోపాటు గల్ఫ్ ప్రాంతంతో భారత్‌కు అనేక ప్రయోజనాలు ముడివడి ఉన్నాయి. పశ్చిమాసియాలో భారత ప్రస్థానం అనేక సవాళ్ల మధ్య కొనసాగుతోంది. ఈ తరుణంలో తాజా పరిణామాలపై భారత స్పందనకు ప్రాధాన్యం ఏర్పడింది.
భారత్ పిలుపు
‘గల్ఫ్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, భద్రతలను నెలకొల్పడమే అందరి లక్ష్యం కావాలి’ అని భారత్ పిలుపిచ్చింది. ఏ పక్షంవైపూ ఇసుమంత మొగ్గు కూడా కనబడకుండా భారత్ పూర్తి నియంత్రణతోనే స్పందించిందనాలి. పశ్చిమాసియాలో నెలకొన్న అస్థిరత నేపథ్యంలో దేశ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలకు దెబ్బతగలకుండా దౌత్య నిపుణులు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంది. గల్ఫ్ దేశాల్లో సుమారు 80 లక్షల మంది భారత పాస్‌పోర్టులతో నివసిస్తున్నారు. వీరి ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలోకి ఏటా నాలుగు వేలకోట్ల డాలర్ల ధనం ప్రవహిస్తోంది. గల్ఫ్‌మీద సంక్షోభ మేఘాలు ముసురుతున్న ప్రస్తుత తరుణంలో అక్కడి భారతీయ కార్మికులంతా మన దేశానికి బారులు తీరకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
పశ్చిమాసియా సీమల్లో స్థిరపడిన భారతీయుల సంఖ్య భారీగా ఉన్న నేపథ్యంలో ఇది చెప్పినంత సులభం కాదు. లిబియాలో 2011లో అంతర్యుద్ధం తలెత్తినప్పుడు అక్కడనుంచి 18వేల మంది భారతీయులను, 2015 ఏప్రిల్‌లో యెమెన్‌నుంచి 5,000 మంది దేశీయులను భారత్‌కు రప్పించే క్రమంలో ప్రభుత్వానికి ఎదురైన సమస్యలు అన్నీ ఇన్నీ కావు. మళ్ళీ అలాంటి పరిస్థితి తలెత్తకుండా గల్ఫ్‌లోని ప్రాంతీయ పక్షాలు, అమెరికా వంటి దేశాలతో చురుగ్గా సంప్రతింపులు జరిపి ఉద్రిక్తతలు సద్దుమణిగేలా చర్యలు తీసుకోవాలి. అరబ్ దేశాల్లోని భారతీయ కార్మికుల జీవికకు ఇబ్బంది లేకుండా భిన్నపక్షాల మధ్య సమన్వయంకోసం నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన బాధ్యత భారత్‌పై ఉంది.
అతిపెద్ద సవాల్
భారత్ ముందున్న రెండో అతిపెద్ద సవాలు గల్ఫ్‌నుంచి చమురు సరఫరాకు విఘాతం వాటిల్లకుండా చర్యలు తీసుకోవడం. దేశ ముడిచమురు, సహజ వాయువు మొత్తం దిగుమతుల్లో 60శాతం గల్ఫ్ ప్రాంతం నుంచి వస్తున్నదే. 2018లో ఈ దిగుమతుల విలువ 11,200 కోట్ల డాలర్లు! ప్రపంచంలోనే అత్యధికంగా ముడిచమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్‌నుంచి భారత్‌కు ముడిచమురు దిగుమతులు ఇప్పటికే భారీగా తగ్గిపోయాయి. పశ్చిమాసియాలో దేశాల మధ్య విభేదాల అగ్గి రాజుకోవడం భారత్ ముడిచమురు దిగుమతుల బిల్లుపై ప్రభావం చూపుతోంది. పెట్రోలియంతో ముడివడిన దేశీయ ఆర్థికాన్ని ఈ పరిణామాలు కుంగదీసే అవకాశం కొట్టిపారేయలేనిది. ఈ పరిస్థితుల్లో సహేతుక ధరలకు, దేశ అవసరాలకు తగినమేర చమురు దిగుమతులు అందుబాటులో ఉండేలా జాగ్రత్తపడటం భారత్ ముందున్న సవాలు.
గల్ఫ్ ప్రాంతంతో ముడివడిన కీలక సముద్ర మార్గాల గుండా నౌకా రవాణాకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవడం భారత్ ముందున్న మరో సమస్య. ఇరాన్, అరేబియన్ ద్వీపకల్పాల మధ్య ఉన్న హోర్ముజ్, పర్షియన్ జలసంధులకు అనుసంధానంగా సాగే నౌకా రవాణా మార్గాల్లో రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూసుకోవడం కీలకం. మరోవంక యెమెన్, ఆఫ్రికా అగ్రభాగాల మధ్య ఎర్ర సముద్రాన్ని, హిందూ మహాసముద్రాన్ని అనుసంధానిస్తున్న బాబ అల్-మందబ్ జలసంధి ద్వారా కూడా సముద్ర రవాణా సాగుతోంది. ఈ ప్రాంతంలోనూ భారత సముద్ర రవాణాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది. సముద్ర రవాణా భద్రత గురించి ప్రధాని మోదీ వివిధ సందర్భాల్లో ప్రస్తావించారు. భారతీయ నౌకా వాణిజ్య రవాణాకు ఎలాంటి భద్రతపరమైన ఇబ్బందులు తలెత్తకుండా పర్షియన్ గల్ఫ్‌లో మోదీ ప్రభుత్వం రెండు నౌకలను ఏర్పాటు చేసింది. పశ్చిమాసియాలో రాజకీయ వేడి పెరుగుతున్న తరుణంలో ఆ ప్రభావం సముద్ర వాణిజ్యంపై పడకుండా సంబంధిత దేశాలన్నీ చర్యలు తీసుకోవాలి, పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకొని అవగాహనతో పనిచేయాలి. సంక్షోభాన్ని సద్దుమణిపే చర్యలు చేపట్టడంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ తరుణంలో గల్ఫ్ ప్రాంతంలో భద్రత, ఆర్థిక, ఇంధన ప్రయోజనాలున్న దేశాలన్నింటినీ కూడగట్టుకొని రాజకీయ సుస్థిరత సాధనకోసం భారత్ అడుగులు కదపాలి.
నిర్దేశించుకోవాల్సిన లక్ష్యం
పశ్చిమాసియా సంక్షోభం బారినపడి మన అంతర్జాతీయ వాణిజ్యం కుదేలుకాకుండా చూసుకోవడమన్నది ఇప్పుడు భారత్ నిర్దేశించుకోవాల్సిన లక్ష్యం. గల్ఫ్‌లో యూఏఈ భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇరు దేశాల మధ్య 2018లో 6,000 కోట్ల డాలర్ల వాణిజ్యం జరిగింది. బాబ్ అల్- మందబ్ జలసంధి ద్వారానే పశ్చిమ దేశాలతో, ఐరోపా సమాఖ్యతో భారత్ చాలావరకు వాణిజ్యం నెరపుతోంది. భారత్-ఈయూల మధ్య 2018లో 10,200 కోట్ల డాలర్ల విలువైన వాణిజ్యం చోటు చేసుకొంది. ఈ జలసంధి ద్వారానే రెండు ప్రధానమైన ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు ఐరోపాతో, ఇతర ప్రపంచంతో డిజిటల్ బంధాన్ని ఏర్పరుస్తున్నాయి. భారతీయ ఎలక్ట్రానిక్ వాణిజ్యానికి అవసరమైన సాధన సంపత్తిలో అత్యధిక భాగం మనకు బాబ్ అల్ మందబ్ ద్వారానే సమకూరుతోంది.
భారత జీడీపీలో అంతర్జాతీయ వాణిజ్యం 40శాతానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. 2025నాటికి అయిదు లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించాలంటే అంతర్జాతీయ వాణిజ్యం అత్యంత కీలకం. కాబట్టి గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న రాజకీయ అస్థిరత, యుద్ధ వాతావరణం తొలగడం భారత్‌కు ఇప్పుడు చాలా అవసరం. దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా భారత విదేశాంగ విధానకర్తలు చురుకుగా వ్యవహరించాల్సిన సందర్భమిది.
-అశోక్ ముఖర్జీ.
ఇదీ చూడండి : 2019: రెండో అత్యంత వేడి సంవత్సరం!