కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న వేళ ఈ సంక్షోభంపై చర్చించేందుకు దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి సార్క్ వర్క్‌షాప్‌ను నిర్వహించనుంది. గురువారం భారత్ నిర్వహించనున్న ఈ వర్క్‌షాప్‌నకు పాకిస్థాన్‌ను ఆహ్వానించింది.
ఆరోగ్యశాఖ కార్యదర్శుల స్థాయిలో జరుగుతోన్న ఈ వర్క్‌షాప్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు. కొవిడ్-19 సంక్షోభం, వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ప్రణాళికలపై సభ్య దేశాలు ఈ కార్యశాలలో చర్చించనున్నాయి.
గతేడాది మార్చి 15న సార్క్ దేశాల అధినేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో.. కరోనా వైరస్ ఎమర్జెన్సీ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. దీనికి భారత్ 10మిలియన్ అమెరికన్ డాలర్లను అందజేస్తుందని ప్రకటించారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్ తయారీలో ముందున్న భారత్, పొరుగు దేశాలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌లను అందిస్తోంది. సార్క్ కూటమిలో అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మాల్దీవులు, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక ఉన్నాయి. 2014లో నేపాల్ సార్క్ సదస్సును నిర్వహించింది. 2016లో పాకిస్థాన్‌లో సదస్సు జరగాల్సి ఉన్నప్పటికీ, భారత్ వైదొలగడంతో ఆ సదస్సు రద్దు అయ్యింది.
ఇదీ చూడండి: చేతిలో ఇమిడే 'ఆక్సిజన్ బాటిళ్లు'.. దొరికేది ఎక్కడంటే?